English | Telugu

హైదరాబాద్ కు మార్చిలోనే వచ్చేసిన కొత్త కరోనా స్ట్రెయిన్.. ఐజీఐబీ డైరెక్టర్ 

కరోనా మహమ్మారి నిరంతరం రూపాంతరం చెందుతూ ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం ఇలా రూపాంతరం (మ్యుటేషన్‌) చెందిన వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తించింది. తాజాగా ఈ వైరస్ మరింతగా రూపాంతరం చెంది సూపర్‌ స్ర్పెడర్ ‌(స్ర్టైయిన్‌‌) గా మారి బ్రిటన్‌ లో విలయం సృష్టిస్తోంది.

అయితే, ఈ సూపర్‌ స్ర్పెడర్ స్ర్టైయిన్‌ మన దేశంలోకి ఈ ఏడాది మార్చిలోనే ప్రవేశించినట్లు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్ఐఆర్‌) అనుబంధ సంస్థ అయిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ సంస్థ ప్రస్తుతం బయటపడ్డ కొత్త రకం వైరస్ ప్రభావాన్ని గుర్తించడానికి జన్యు విశ్లేషణలో నిమగ్నమైంది. మొన్న మార్చికి ముందు ఉన్న వైరస్‌కు భిన్నమైన రకాలను మనదేశంలో గత మార్చిలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో ఒక రకాన్ని సూపర్ స్ప్రెడర్‌గా గుర్తించి దానికి "ఏ4" అని పేరు పెట్టారు. ఆగ్నేయ ఆసియాలో మొదలైన ఈ ఏ4 రకం సూపర్‌ స్ర్పెడర్‌ వైరస్ .... హైదరాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతాల నుంచి సేకరించిన నమూనాల్లో తేలింది. అయితే, మన భారతీయుల్లోని వ్యాధి నిరోధక వ్యవస్థ దెబ్బకు అది జూన్‌ నాటికి దానికదే నాశనమై ఉండొచ్చని.. శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈ రకం వైరస్ అలా అంతం కాకపోతే కేవలం మూడు నెలల్లో ఇండియాలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అనురాగ్‌ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ సూపర్‌ స్ర్పెడర్ స్ర్టైయిన్ గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని అయన అన్నారు. అయితే, ప్రస్తుతం వెలుగుచూసిన రకం వేగంగా విస్తరిస్తుండడంతో మనం మరింత అప్రమత్తతతో ఉండాలని అయన హెచ్చరించారు. అదేసమయంలో వైరస్ లోని మార్పులు బ్రిటన్‌ కంటే ఇక్కడే ఎక్కువని అయన చెప్పారు. రూపాంతరం చెందిన వైరస్ రకాలను కూడా త్వరలో రానున్న టీకాలు సమర్థవంతంగా నిరోధిస్తాయని ఆశిస్తున్నామని అనురాగ్‌ అగర్వాల్‌.