English | Telugu

మ‌న‌సులో మాట పుస్త‌కంపై వివాదం.. మంత్రులకు లోకేష్ సవాల్

మ‌న‌సులో మాట పుస్త‌కంపై ఏపీ శాసనమండ‌లిలో వివాదం నెల‌కొంది. తుఫాన్ పంట నష్టంపై శాసనమండలిలో నిన్న అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు వ్యవసాయమే దండగని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు రైతుల కోసం అంటూ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. చంద్రబాబు మనసులో మాట అనే పుస్తకంలో వ్యవసాయం దండగ అని రాశారని, ఆ పుస్తకం తెస్తే చంద్రబాబు వ్యవసాయం గురించి ఏం మాట్లాడారో చూపిస్తానని బొత్స అన్నారు.

బొత్స వ్యాఖలను కొనసాగిస్తూ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కూడా మాటల దాడి చేశారు. వ్యవసాయం పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కారణంగానే మనసులో మాట పుస్తకాన్ని మార్కెట్ లో దొరక్కుండా చేశారని విమర్శించారు. మనసులో మాట పుస్తకం ఇంట్లో ఉంటే, లోకేష్ దాన్ని తీసుకురావాలని, చంద్రబాబు అన్న మాటలు చూపిస్తామని బుగ్గన అన్నారు. మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాసుకున్న మనసులో మాట అన్న దిక్కుమాలిన పుస్తకం తమ వద్ద లేదన్నారు. టీడీపీ నేతల వద్ద ఆ పుస్తకం ఉంటే తీసుకురావాలన్నారు.

ఇలా మండ‌లిలో తొలిరోజు ఏపీలో తుఫాను పంట నష్టంపై మొదలైన చర్చ కాస్త, చంద్రబాబు మనసులో మాట పుస్తకంపై చర్చకు దారితీసి రసాభాసగా మారింది. మ‌న‌సులో మాట పుస్త‌కంపై ఏపీ శాసనమండ‌లిలో రెండోరోజూ వివాదం నెల‌కొంది. వ్య‌వ‌సాయం దండ‌గ అని చంద్ర‌బాబు ఎక్క‌డ అన్నారో నిరూపించాలి అని టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. గతం లో జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని మంత్రులు బొత్స‌, క‌న్న‌బాబు ఏమ‌ని విమ‌ర్శించారో తమ వ‌ద్ద ఆధారాలున్నాయని తెలిపారు. చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై ఆధారాలుంటే నిరూపించాలని మంత్రులకు లోకేష్ సవాల్ చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. గ‌తంలో వైసీపీని చంచ‌ల్ గూడ పార్టీ అని క‌న్న‌బాబు అన‌లేదా? అని ప్రశ్నించారు. అదే పార్టీలో చేరి ఇప్పుడు మంత్రి ప‌ద‌వి తీసుకున్నారని ఎద్దేవా చేశారు. వ్య‌వ‌సాయం దండ‌గని చంద్రబాబు ఎక్క‌డా అన‌లేదని, రుజువులు, సాక్ష్యాల‌తో మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. మ‌న‌సులో మాట పుస్త‌కం మీరు తీసుకురాలేక‌పోయారు క‌నుక‌నే మేము తీసుకువ‌చ్చాం అని తెలిపారు. అంతేకాదు, ఈ సందర్భంగా ఆ పుస్త‌కంలోని మాట‌ల‌ను రాజేంద్రప్రసాద్ మండ‌లిలో చ‌దివి వినిపించారు.