English | Telugu

అసెంబ్లీ దగ్గర ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో ఆత్మ బలిదానం చేసుకున్నారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఆరేళ్ళు దాటాక కూడా బలిదానాలు చేసుకోవడం ఆవేదన కలిగిస్తోంది.

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఎదుట నాగులు అనే వ్యక్తి పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. గురువారం నాడు అసెంబ్లీ సమీపంలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ వచ్చిన తరువాత కూడా బతుకుల్లో మార్పు లేదని, తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నాగులు ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు అతణ్ని రక్షించే ప్రయత్నం చేశారు. వెంట‌నే ఆటోలో ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే అత‌ని ప‌రిస్థితి విష‌మించి ఈరోజు మ‌ర‌ణించాడు.

నాగులు మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. అతని మరణానికి ప్రభుత్వమే కారణమని, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హ‌త్యేన‌ని అన్నారు. తెలంగాణ వచ్చినా కూడా ప్రజలకు ఏమి లాభం జరగలేదని నాగులు చెప్పాడని అన్నారు. అమరవీరుల ఆత్మత్యాగాలతో వచ్చిన తెలంగాణ ఫలితాలు ఒక్క సీఎం కుటుంబానికి దక్కుతున్నాయని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.