English | Telugu

గ్రేటర్ లో అద్భుతంగా పోరాడారు! బండికి ప్రధాని ప్రశంస

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్‌కి ప్రధాని మోడీ ఫోన్ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు ఎన్నికల సరళిపై, పార్టీ పరిస్థితులపై ముచ్చటించారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని మోడీ అభినందించినట్టు పేర్కొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారుని, నాయకుల, కార్యకర్తలపై జరిగిన దాడుల వివరాలు అడిగారని బండి సంజయ్ తన ప్రకటనలో చెప్పారు.

పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను ప్రధాని మోడీ కొనియాడారన్నారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ పనిచేయడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారన్నారు. దైర్యంగా ముందుకు సాగాలని అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని మోడీ సూచించినట్టు తెలిపారు.