English | Telugu
14రోజుల క్వారంటైన్ కు సిద్ధపడితేనే ఏపీకి రండి
Updated : Mar 27, 2020
సీఎం వైఎస్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా నిరంతర పర్యవేక్షణకు ఐదుగురు మంత్రులతో ఏపీ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్ర నాథ్, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు సభ్యులుగా ఉన్నారు. ప్రతి రోజూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు సీఎం ఆదేశించారు.
కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఈ భేటీలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకలను సిద్ధం చేశామని, జిల్లాల్లో 200 పడకలను ఏర్పాటు చేశామని అన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో కరోనా ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సరుకుల రవాణా వాహనాలను అనుమతిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు. 14రోజుల క్వారంటైన్ కు సిద్ధమైతేనే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రాష్ట్రంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించి సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టించొద్దని కోరారు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని.. ఇక్కడి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.