English | Telugu

అన్‌లాక్-4 గైడ్‌లైన్స్.. మెట్రోకు గ్రీన్ సిగ్నల్.. సినిమా థియేటర్లు?

అన్‌లాక్-4 కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. అయితే కంటైన్‌మెంట్ జోన్స్‌లో లాక్‌డౌన్ నిబంధనలు సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. దేశంలో దశలవారీగా మెట్రో సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.

సెప్టెంబర్ 21 నుంచి క్రీడలు, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. 100 మందికి మించకుండా సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని నిబంధన విధించింది. అదే విధంగా సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చింది. అంతరాష్ట్ర రవాణాకు కూడా అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది.

సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్ పై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఆన్‌లైన్/డిస్టెన్స్ లెర్నింగ్‌ కొనసాగేందుకు, ప్రోత్సహించేందుకు అనుమతించినట్టు పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగనుంది.