English | Telugu

ప్రేమికుల రోజుకు ముందు విషాదాన్ని నింపిన ప్రేమ జంట...

ప్రేమికుల రోజుకు రెండు రోజుల ముందు విశాఖలో ప్రేమ జంట జీవితం విషాదంగా ముగిసింది. కొన్ని గంటల వ్యవధి లోనే యువతీ, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో ఇరు కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. నగరంలోని గోపాలపట్నం, కంచరపాలెం పీఎస్ ల పరిధిలో జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేసింది. ఎలమంచిలికి చెందిన శిరీష కుటుంబం కొంత కాలం క్రితం విశాఖకు మకాం మార్చింది. గోపాల్ పట్టణంలో బ్యూటీ పార్లర్ నడుపుకొని జీవనం సాగిస్తోంది. అదే ఊరికి చెందిన వెంకట్ కుటుంబం కంచరపాలెంలో ఉంటుంది.

వెంకట్, శిరీష ల మధ్య 2013 నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రతి రోజూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. మంగళవారం సాయంత్రం వెంకట్ తో ఫోన్ లో గొడవపడింది శిరీష. చనిపోతానని హెచ్చరించి ఫోన్ కట్ చేసింది. దీంతో శిరీష సోదరుడికి వెంకట్ సమాచారమిచ్చాడు. అప్పటికే ఇంటి పై అంతస్తులోకి వెళ్లి ఆత్మహత్యా యత్నం చేసింది శిరీష. కొన ఊపిరితో ఉన్న ఆమెను కేజీహెచ్ కు తరలిస్తుండగా దారి మధ్యలో చనిపోయింది. శిరీష మరణాన్ని జీర్ణించుకోలేని వెంకట్ తాను చనిపోవాలని నిశ్చయించుకున్నాడు. కంచరపాలెంలో బాలాజీ నగర్ లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే ఊరికి చెందిన వెంకట్, శిరీషలు ఆత్మహత్యలకు పాల్పడటం అటు కుటుంబ సభ్యుల్లోనూ ఇటు ఎలమంచిలి వాసుల్లోనూ విషాదాన్ని నింపింది.