English | Telugu
ఆంధ్రా నుండి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా!!
Updated : Nov 19, 2019
కృష్ణా జిల్లా నందిగామలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఓ వైపు రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల ఉపాధి లేక కూలీలు అల్లాడుతుంటే మరోవైపు దర్జాగా అక్రమ రవాణా సాగిపోతుంది. కృష్ణా జిల్లా నుండి పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతున్న ఇసుక లారీలను చెక్ పోస్టు దగ్గర పోలీసులు పట్టుకున్నారు. నందిగామ డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టిన చర్యలు తీసుకుంటున్నామని.. అదే విధంగా 110 కిలో మీటర్లు ఉన్న డివిజన్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తం 7 చెక్ పోస్టులు, 6 మొబైల్ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు నందిగామ డీఎస్పీ చెప్పారు.
ఇటీవల కాలంలో నందిగామ పరిధిలో చెక్ పోస్టుల పరిధిలో పోలీసులు లారీలను పట్టుకున్నారు. జొన్నల గడ్డ, అనాసాగరం, కీసర ప్రాంతాల్లో లారీలను ఆపి పరిశీలిస్తే పాత బిల్లులతో పర్మిట్లు ఉన్నాయి. వాటిని ఉపయోగించి కృష్ణా జిల్లా నుంచి తెలంగాణకు ఇసుక తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. పర్మిట్ లు తీసుకున్న వాహన దారులు మోతాదుకు మించి లోడ్ ను లారీల్లో నింపుతున్నట్లు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. వాటికి జరిమానా కూడా విధించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ఇసుక వారోత్సవాలు జరుపుతుంటే మరోవైపు అక్రమార్కులు ఏదో ఓ రూపంలో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.