English | Telugu
స్వీయ నిర్భందమే శ్రీ రామ రక్ష
Updated : Apr 2, 2020
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడం మానేశారు. నిత్యం జనాల రద్దీతో దర్శనమిచ్చే అనేక పట్టణాలు, నగరాలు మూగబోయాయి. మందుల షాపులు నిత్యావసరాల దుకాణాలు తప్ప మరే ఇతర షాపులు తెరుచుకోవడం లేదు. కరోనా వైరస్ ప్రభావం అలయాలపైనా పడింది. భక్తులు నిత్యం ఆరాధించే భగవంతునికీ కరోనా కష్టాలు తప్పడం లేదు. 12 రోజులుగా కనీవినీ ఎరుగని రీతిలో ఆలయాలు మూసివేయబడి ఉన్నాయి. చివరికి నేడు సీతారాముల కల్యాణం సైతం ఆలయాలకు మాత్రమే పరిమితమై కేవలం పూజారుల సమక్షంలోనే నిర్వహించాల్సిన పరిస్థితి ఎదురైంది.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజా రవాణా నిలిచిపోయింది. నిత్యం వేలాది మంది ప్రయాణించే రైలు కూతలు వినపడటం లేదు. బస్సులు డిపోనలకే పరిమితమయ్యాయి. అంతటా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ముగబోయాయి. షూటింగులు సైతం నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అడ్డాలుగా ఉన్న ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. పోలీసు స్టేషన్లలో వివిధ కేసులను ఛేదిస్తూ బిజీగా ఉండే పోలీసులు నేడు ప్రజలకు రక్షణగా రాత్రనక పగలనక రోడ్లపై జాగారం చేయాల్సిన పరిస్థితి చూస్తున్నాం.
ఇంత జరుగుతున్నా, ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయే పరిస్థితి ఎదురైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విదిస్తే.. కొందరు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చీటికీ మాటికి బయటకు వచ్చి కరోనా విజృంభించేలా చేస్తున్నారు. ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా వీరికి చీమకుట్టినట్టు కూడా లేకుండా పోతుంది. మాకోసమే ప్రభుత్వం పని చేస్తుందన్న కనీస ఇంగితం లేకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. మే చివరి వరకు సరిపడా సరుకులు నిల్వ ఉంచామనీ, ప్రజలు ప్రతిదానికి రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని ప్రభుత్వం, అధికారులు మొత్తుకుంటున్నా వినడం లేదు. ఇకనైనా ప్రజలు ఆలోచించాలని తెలుగు వన్ న్యూస్ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 2 వేలు దాటిపోయాయి. మరిన్ని కేసులు నమోదు కాకుండా ఉండాలంటే స్వీయ నిర్బంధమే మనకు శ్రీ రామ రక్ష. మన ప్రాణాలను మనమే రక్షించుకుందాం.. కరోనాను తరిమి కొడదామని మరోసారి చేతులు జోడించి మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.