English | Telugu

మావోయిస్టుల ప్రభావం విద్యార్ధుల పై ప్రభావం చూపనుందా?

నేటి విద్యార్ధులే రేపటి భావి భారత పౌరులు అన్నారు పెద్దలు. కానీ ఇప్పటి పరిస్థితులకు మాత్రం విద్యార్ధులనే లక్షంగా చేసుకుంటున్నారు కొందరు. వివరాళ్లోకి వెళ్తే విద్యార్థి నేతల పై నిఘా పెట్టాల్సిన పరిస్థితి పోలీసులకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలిక మళ్లీ మొదలైంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులని మావోయిస్టులుగా మార్చే కుట్ర జరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో విద్యార్ధులను రెచ్చగొడుతోన్న వివిధ నిషేధిత సంస్థల పై నిఘా పెట్టారు పోలీసు అధికారులు. అంతేకాదు కొందరు అనుమానితులను అదుపులోకి కూడా తీసుకున్నారు.

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ విద్యార్ధి వేదిక (టీవీవీ) అధ్యక్షుడు మద్దిలేటితో పాటు జగన్, సాయన్నలను కూడా అదుపులోకి తీసుకున్నారు అధికారులు. మరో వైపు విద్యార్ధి నేతలు అనుదీప్, నాగరాజు, రమేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సందీప్, గోపి, ఖాసిమ్ ల పై పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేశారు. మావోయిస్టులకు పలు విద్యార్థి సంఘాలు సహకరిస్తున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో ముప్పై విద్యార్థి సంఘాలను నిషేధించినట్టు తెలిపారు. గత కొంత కాలంగా జగన్ మావోయిస్టులతో టచ్ లో ఉన్నాడనీ మావోయిస్టులకు ఫండ్ ఇవ్వాలనీ కొన్ని కంపెనీల బెదిరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

దీంతో జగన్, మద్దిలేటి ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మావోయిస్ట్ నేత హరిభూషణ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. జగన్, మద్దిలేటిపై పూణే కర్ణాటకల్లో కేసులున్నట్లు గుర్తించారు. కొన్ని నిషేధిత మావోయిస్టు సంస్థలు విద్యార్ధులను రెచ్చగొట్టి వారిని నక్సలిజం వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

తుపాకీ పట్టి వయోలెన్స్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీపీఐ మావోయిస్టు సంస్థతో పాటు తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. అయితే భారతదేశంలో ఇలాంటి వాటికి స్థానం లేదన్నారు. తెలంగాణ విద్యార్థి వేదిక ప్రెసిడెంట్ మద్దిలేటి ఇంట్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సిపి అంజనీ కుమార్. ప్రభుత్వం ఇటువంటి చర్యల పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.