English | Telugu

కవితకు దసరా గిఫ్ట్! ఆ మంత్రికి టెన్షన్

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ముగిసింది. కౌంటింగ్ ఈనెల 12న జరగనున్నా... ఫలితమేంటో అందరికి ముందే తెలిసిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ఏకపక్షంగానే సాగడంతో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమే. ఎమ్మెల్సీగా కవిత విజయంపై ఎవరికి అనుమానం లేకున్నా.. ఆమె గురించే ఇప్పుడు మరో చర్చ నిజామాబాద్ జిల్లాలో ఊపందుకుంది. శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న కవితకు సీఎం కేసీఆర్ త్వరలోనే మరో గిఫ్ట్ ఇవ్వబోతున్నారనే చర్చ జిల్లాతో పాటు టీఆర్ఎస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. కవితకు కేసీఆర్ దసరా కానుక ఇవ్వబోతున్నారని ఆమె అనుచరులు, అభిమానులు ప్రచారం మొదలుపెట్టేశారు.

రీ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో కవిత కీలకంగా మారనున్నారనే చర్చ టీఆర్ఎస్ పార్టీలోనూ జరుగుతోంది. కవిత ఎమ్మెల్సీ గా మాత్రమే పరిమితం కారని , మంత్రిగా రాష్ట్ర రాజకీయాలలో పని చేస్తారని నిజామాబాద్ జిల్లా గులాబీ నేతలు కూడా చెబుతున్నారు. అయిదేళ్లపాటు ఎంపీగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కవిత.. ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పబోతున్నారని చెబుతున్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు కవిత. పరాజయం తర్వాత ఆమె పాలిటిక్స్ లో సైలెంట్ అయ్యారు. చాలా రోజుల పాటు బయటికి కూడా రాలేదు. గత సంవత్సరం జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను పట్టించుకోలేదు. చివరకు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆమె జోక్యం చేసుకోలేదు. కవిత రాజకీయ భవిష్యత్ పై రకరకాల ప్రచారాలు కూడా జరిగాయి. అయితే ఇంతకాలం రాజకీయాలకు దూరంగా సైలెంట్ గా ఉన్న కవిత.. సడెన్ గా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ బరిలోకి దిగారు. కవితను ఎమ్మెల్సీగా బరిలోకి దింపిన సీఎం కేసీఆర్.. అంతటితో ఊరుకోరని.. ఆమెకు కచ్చితంగా ప్రమోషన్ ఉంటుందని తెలంగాణ భవన్ లోనూ చర్చ జరుగుతోంది. సమయం చూసే కవితను మళ్లీ యాక్టివ్ చేశారని చెబుతున్నారు. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్.. రాష్ట్ర పాలనా పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారనే చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే కవితను ఎమ్మెల్సీ చేశారని, కేబినెట్ లోకి తీసుకుని కేటీఆర్ కు సపోర్ట్ గా ఉంచుతారనే వాదన గులాబీ పార్టీలో వినిపిస్తోంది.

మరోవైపు కవిత రీ ఎంట్రీతో నిజామాబాద్ జిల్లాలో ఆమె అనుచరుల్లో సంతోషం కనిపిస్తుండగా, మరికొందరు గులాబి నేతలలో మాత్రం టెన్షన్ కనిపిస్తుంది. కవితకు మంత్రిగా అవకాశం ఇస్తే నిజామాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి అవుట్ అన్న చర్చ జోరుగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆ మంత్రి పనితీరుపై పార్టీలోనూ అసంతృప్తి ఉందని తెలుస్తోంది. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతోనూ ఆయనకు సఖ్యత లేదని సమాచారం. అందుకే ఆ మంత్రికి చెక్ పెట్టేందుకే కవితను ఎమ్మెల్సీగా పోటీ చేయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే కొన్ని రోజులుగా కవిత గెలుపు కోసం ఆ మంత్రి కష్టపడుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ చేరేలా పావులు కదిపారు. చాలా మందిని కారు ఎక్కించారు. ఇన్ని రోజులుగా కవిత గెలుపు కోసం కష్టపడుతున్న ఆ మంత్రికి.. కవిత రూపంలోనే గండం వచ్చిందని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.