English | Telugu
కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ రివర్స్ గేమ్... యడియూరప్పకు షాకిచ్చేందుకు స్కెచ్...
Updated : Feb 5, 2020
నెంబర్ గేమ్ తో సంకీర్ణ సర్కారును కూలదోసి కర్నాటకలో గద్దెనెక్కిన బీజేపీకి అదే ఫార్ములాతో రివర్స్ షాకిచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ పావులు కదుపుతున్నాయి. గతేడాది కాంగ్రెస్-జేడీఎస్ సర్కారుపై తిరుగు బావుటా ఎగురవేసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రెబల్ ఎమ్మెల్యేలు తాము ఆశించిన పదవులు దక్కకపోవడంతో మళ్లీ సొంత గూటివైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పదవులు ఆశించి ఆనాడు యడియూరప్పకు సహకరించిన కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు... ఆ తర్వాత అనర్హత వేటుతో తమ పదవులను కోల్పోయి... తిరిగి ఉపఎన్నికల్లో గెలిచారు. అయితే, వీళ్లంతా కేబినెట్లో పదవులు ఆశించగా భంగపాటు ఎదురైంది. దాంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కవన్న అంచనాకి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు యడియూరప్పపై తిరుగుబాటు ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు పంపుతున్నారు. అయితే, వాళ్ల సంకేతాలను గుర్తించిన కాంగ్రెస్, జేడీఎస్ లు... మళ్లీ సొంత గూటికి తిరిగొస్తామంటే పరిశీలిస్తామంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నాయి. దాంతో, కర్నాటకలో మళ్లీ నెంబర్ గేమ్ మొదలుకానుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పార్టీని వదిలి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలంతా తిరిగి రావాలంటూ కుమారస్వామే స్వయంగా పిలుపునివ్వడంతో కర్నాటక రాజకీయం మరోసారి రసవత్తరంగా మారనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరి, రెబల్ ఎమ్మెల్యేలు బుజ్జగింపులకు లొంగుతారో లేక మరోసారి నెంబర్ గేమ్ కు తెరలేపుతారో చూడాలి.