English | Telugu

కల్వకుంట్ల కవిత భవిష్యత్ ఏమిటి?

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నిన్నటి వరకూ కవితను రాజ్యసభకు పంపించనున్నారని, జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించనున్నారని పలు కథనాలు వచ్చాయి. రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి కవితకు ఖాయమని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా వెల్లడించారు. దీంతో త్వరలోనే కవిత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నట్లు అందరూ ఊహించారు. కానీ కేసీఆర్ నిర్ణయంతో పార్టీ కేడర్ ఒక్కసారి ఉలిక్కిపడింది. రాజ్యసభ రెండుస్థానాలు ఇతరులకు ఇవ్వడంపై కవితను కేసీఆర్ ఏం చేయాలనుకున్నారనేది సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. కవితకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? లేదా ఉద్దేశపూరకంగానే ఖాళీగా ఉంచుతున్నారా? టిఆర్ ఎస్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌.

నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఓడిపోయినప్పటి నుంచి కవిత పార్టీలోగానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లోగానీ కీలకంగా వ్యవహరించడం లేదు. దూరంగా ఉంటున్నారు. ఓటమి నుంచి కవిత తేరుకోవడం లేదని అనుకున్నారు. కానీ పార్లమెంటు ఎన్నికలు పూర్తయి 10 నెలలు గడుస్తున్నప్పటికీ కవిత మౌనం వీడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ముందు కవిత అమెరికాకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో తమ అనుచరులకు టిక్కెట్లు దక్కలేదని, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అమెరికా వెళ్లారని అప్పట్లో పలు కథనాలు వచ్చాయి.

కవిత విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై జాగృతి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కవితకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెడుతారా అనే కొత్త ప్రచారం ప్రారంభ‌మైంది. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 90శాతం స్థానిక సంస్థలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది కాబ‌ట్టి దీంతో నిజామాబాద్ స్థానాన్ని ఈజీగా గెలిచే అవకాశాలున్నాయి. ఆ స్థానం కూడా కేసీఆర్ డిక్లేర్ చేయకుండా పెండింగులో ఉంచారు. ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవి కట్టబెట్టనున్నారా? అనే విషయంలో కూడా స్పష్టత లేదని పార్టీ కేడర్ గుసగుసలాడుకుంటున్నారు. ఇక‌ ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే కవిత భవిష్యత్ ప్రశ్నార్థక‌మే.

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థ కూడా సమర్థవంతంగా పనిచేసింది. జాగృతి తరపున కవిత, బతుకమ్మ వంటి కార్యక్రమాలను నిర్వహించి తెలంగాణ సంస్కృతిని చాటారు. ప్ర‌స్తుతం జాగృతి కార్యకర్తలను టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదట‌. కవిత సైన్యాన్ని లెక్కచేయపోతే.. ఇక మామూలు నాయకుల పరిస్థితి ఏంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.

కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తున్నదని, తనయుడు కేటీఆర్ ను అందలం ఎక్కిస్తూ కవితను పట్టించుకోవడం లేదనే వాదనలు కూడా లేకపోలేవు. దీంతో తన తండ్రితో తనకు ప్రాధాన్యత ఉన్న పోస్టు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై కేసీఆర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. కవితకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కేసీఆర్ ఇష్టం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో పార్టీ, ప్రభుత్వంలోగానీ కవితకు ఎలాంటి పోస్టు ఇవ్వనున్నారో ప్రశ్నార్థకంగా మారింది.