English | Telugu
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో అసలు ఏం జరుగుతోంది?
Updated : Oct 7, 2019
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం ఏర్పాటై రెండేళ్లు పైబడింది. కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. తరవాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాకినాడ కార్పొరేషన్ లో మార్పులు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కాకినాడ కార్పొరేషన్ లో టీడీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ వైసిపి ప్రభుత్వాన్ని కాదని ఎంత వరకూ పాలన సాగిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాకినాడ కార్పొరేషన్ లో పార్టీల బలాబలాలను చూస్తే రెండు వేల పదిహెడులో జరిగిన ఎన్నికల్లో టిడిపి మెజార్టీ దక్కించుకుంది.
మొత్తం నలభై తొమ్మిది డివిజన్లలో అప్పటి మిత్రపక్షమైన బీజేపీ రెబల్ అభ్యర్థులతో కలిపి ముప్పై తొమ్మిది స్థానాలు కైవసం చేసుకొని ఘన విజయం సాధించింది. తర్వాత మిత్ర బంధం తెగి పోవడంతో బీజేపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీకి దూరమయ్యారు. దాంతో వారి సంఖ్య ముప్పై ఏడుకు పడిపోయింది. మేయర్ పదవి ఆశించి భంగపడిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మాకినేడి శేషుకుమారి జనసేన తీర్థం తీసుకోవడంతో టీడీపీ కార్పొరేటర్ల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది. ఇక కార్పొరేషన్ లో ప్రతి పక్ష వైసీపీ బలం పది మంది సభ్యులైతే అందులో ఇద్దరు సభ్యులు పార్టీ అధిష్టానంతో విభేదించి వేరు కుంపటి పెట్టుకున్నారు. దీంతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. అయితే ఇప్పుడు స్టేట్ లో వైసిపి పవర్ లోకొచ్చింది. దానిని ఉపయోగించుకొని వంద కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ లో తనదైన సత్తా చాటుకోవాలని వైసిపి ఉబలాట పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రూట్లో పావులు కదపటం మొదలు పెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయ యుద్దమే సాగుతోంది.
కార్పొరేషన్ ఎన్నికల సమయంలో చక్రం తిప్పిన తెలుగుదేశం నేతలు తర్వాత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సైలెంటైపోయారు. ఆ క్రమంలో మేయర్ స్థానం కైవసం చేసుకున్నప్పటికీ టిడిపి మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పదిహెడు మంది వరకూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, లోపాయికారిగా వైసిపికి మద్దతు ప్రకటించారు. ఆ పరిస్థితికి కారణంగా కార్పొరేషన్ లో మెజార్టీ ఉన్నా పరిపాలనలో మైనార్టీగా ఉండాల్సిన పరిస్థితి టిడిపిది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతిష్ఠాత్మకమైన స్మార్ట్ సిటీ పనులు కూడా జరుగుతుండడంతో అభివృద్ధి పరంగా ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై పాలక వర్గం మల్లగుల్లాలు పడుతోంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు గెలిచిన తరువాత వారికి టీడీపీ కార్పొరేటర్ల మద్దతు పెరిగింది. కన్నబాబు మంత్రి కావడంతో కార్పొరేటర్లు కొంత మంది సన్నిహిత్యం లోకి వెళ్లారు. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో ఆయన వర్గీయులైన కార్పొరేటర్లు కూడా టీడీపీతో టచ్ మి నాట్ అన్నట్లుగా ఉంటున్నారు.
మొత్తమీద టిడిపిలో ప్రస్తుతమున్న ముప్పై ఆరు మంది కార్పొరేటర్లలో సగానికి పైగా కార్పొరేటర్లు రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇందుకు ముఖ్యమంత్రి జగన్ నిరాకరించినట్లు తెలిసింది. వైసీపీలోకి వస్తే కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేసి రావాలని ఆంక్షలు పెట్టినట్టు సమాచారం. దాంతో పదవులు వదులుకోవడానికి ఇష్టపడని టిడిపి కార్పొరేటర్లు కండువా మార్చకూండానే కార్పొరేషన్ లో వైసీపీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీ పరిస్థితి అర్థం కాకుండా తయారైందంటున్నారు.