English | Telugu

ఇసుక విషయంలో నేతలను ఆగ్రహానికి గురిచేస్తున్న పోలీసులు......

ఇసుక కొరత విజయనగరం జిల్లాలో సరికొత్త ఫైట్ కు తెరలేపింది. నేతలు, పోలీసుల మధ్య వివాదంగా మార్చింది. ఒకానొక దశలో జిల్లా ఎస్పీ, మంత్రి బొత్సకు మధ్య మాటల యుద్ధం జరగడం చర్చ నీయాంశంగా మారింది. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. పోలీసులు ఇష్టానుసారంగా కేసులో పెట్టడం పై వైసిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ కార్యకర్తలపై కేసులు పెట్టిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన పోలీసుల తీరు పై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో 3 నెలల కిందట జిల్లా ఎస్పీ రాజకుమారిని ఇదే విషయంలో మందలించారు. నాటుబళ్ల పై కూడా కేసులో పెట్టిస్తే ఎలా అంటూ ప్రశ్నించి సీరియస్ అయ్యారు. మంత్రి చెప్పిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇసుక అక్రమ రవాణా పై పోలీసులు ఎడాపెడా కేసులు పెట్టేశారు. దీంతో మరోసారి ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి దృషికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు వ్యవహారంపై మంత్రి బొత్సా సీరియస్ అయ్యారు. సమావేశంలో ఉన్న ఎస్పీ రాజకుమారితో విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి కేసులు పెట్టండి కాదనం కానీ మీ పోలీసులు కూడా డబ్బులు తీసుకుంటున్నారు.

ఈ విషయం పై కూడా దృష్టి పెట్టండి అంటూ పరోక్షంగా తన అక్కసును వెళ్లగక్కారు. ఇసుక అక్రమ రవాణాపై కేసులు పెట్టే పోలీసులు తమ పనితీరులో కూడా నిజాయితీగా ఉండాలి కదా అంటూ ప్రస్తావించారు. అంతేకాదు సిసిటీవీ ఫుటేజిలను పరిశీలిస్తే మీ పోలీసుల సంగతి తెలుస్తుందంటూ చురకలంటిచారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదం సమావేశాల్లో ఆసక్తిగా మారింది. ఇసుక వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటికే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పోలీసులు అలా మితిమీరి ప్రవర్తిస్తుండడం నేతలకూ అసహనంగా మారింది.ఇక దీని పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.