English | Telugu

వైసీపీలో చేరాలని జేసీపై ఒత్తిడి.. బెదిరింపులు!!

టిడిపి అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన సమయంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారుల సంఘం ఫిరియాదుతో ఐపీసీ 153 ఎ 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జేసీని దాదాపు ఏడు గంటలకు పైగా ఆయనను పోలీస్ స్టేషన్ లోనే నిర్భందించారు. విషయం తెలుసుకున్న జేసీ అనుచరులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మరోవైపు పోలీసులతో టిడిపి నేతలు పార్థసారథి, రఘునాథరెడ్డి, ఈరన్న వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పీఎస్ ఎదుట జేసీ అనుచరుడు ఆత్మహత్య యత్నం చేశాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఓ దశలో టిడిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎట్టకేలకు జేసీకి స్టేషన్ బేయిల్ ఇచ్చారు.

దీంతో కోర్టును ఆశ్రయించిన జేసీ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ప్రతి రెండోవ ఆదివారంతో పాటు నాలుగువ ఆదివారం పది గంటల నుంచి నాలుగు గంటల లోపు స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అందువల్ల అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు దివాకరెడ్డి. అయితే పోలీసుల నిర్బంధం పై టిడిపి నేత దివాకరెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వైసీపీలో చేరాలని పోలీసులు పరోక్షంగా చెప్పారని పోలీసు అధికారులపై రిమోట్ శక్తి బాగా పని చేస్తుందని విమర్శలు గుప్పించారు. కోర్టు ఉత్తర్వులున్నా అక్రమంగా స్టేషన్ లో నిర్బంధించారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు ఉండటంతో టిడిపి క్యాడర్ ను బెదిరించేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని ఫైరయ్యారు జేసీ. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు జేసీ. వైఎస్ హయాంలో ఇలాంటి దుర్మార్గాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు.