English | Telugu

డాక్టర్ శిల్ప సూసైడ్ కేసులో నిందితులకు మళ్ళీ పోస్టింగ్.. ఫైర్ అవుతున్న బంధువులు 

తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల కారణంతో డాక్టర్ శిల్ప 2018 ఆగష్టు 7వ తేదీన తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 2018 నవంబర్ 9వ తేదీన తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో పనిచేసే ముగ్గురు ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సీఐడీ నివేదిక కూడా ఇచ్చింది. లైంగిక వేధింపులకు సహకరించనందుకే డాక్టర్ శిల్పను ఎండీ పరీక్షల్లో ఫెయిల్ చేశారని ఈ నివేదిక తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్లను అప్పట్లో ప్రభుత్వం విధుల నుండి తప్పించింది.

ఇది ఇలా ఉండగా నిన్నటి వరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి టీటీడీ ఈఓ గా బదిలీ అయి వెళ్లే ముందు చివరి ఉత్తర్వులుగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్లకు తిరిగి పోస్టింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి తిరిగి పోస్టింగ్స్ ఎందుకు ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు.