English | Telugu

జాస్తి కృష్ణకిశోర్‌కి చంద్రబాబుకి లింకేమిటి?

జగన్ సర్కారు సస్పెన్షన్ వేటేసిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ కి ఊరట లభించింది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వం.... సస్పెండ్ చేయడంతో కృష్ణకిశోర్ క్యాట్ ను ఆశ్రయించారు. దాంతో, జగన్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ పై క్యాట్ స్టే విధించింది. ఒకపక్క సస్పెన్షన్ వేటేయగా, మరోపక్క సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈడీబీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తులసిరాణి ఫిర్యాదు మేరకు జాస్తి కృష్ణకిశోర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపారు. అయితే, హడావిడిగా రాత్రిపూట ఓ ఐఆర్ఎస్ అధికారిపై సీఐడీ కేసు నమోదు చేయడం.... వెంటనే ఎఫ్ఐఆర్ ను కోర్టుకు పంపడంపై ఇతర అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

ఇక, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ సస్పెన్షన్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. జగన్ కంపెనీలకు జరిమానా విధించారన్న అక్కసుతోనే కృష్ణకిశోర్ పై సస్పెన్షన్ వేటేసి కేసులు నమోదు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అయితే, చంద్రబాబు ఆరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. తప్పు చేస్తే సస్పెండ్ చేయకుండా... సన్మానాలు చేస్తారా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు రావడంతో... పరిశ్రమలశాఖ నివేదిక ఆధారంగానే జాస్తి కృష్ణకిశోర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. అయితే, ఇదేదో జాతీయ సమస్యలాగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని, దీన్నిబట్టి జాస్తి కృష్ణకిశోర్ తో చంద్రబాబుకి ఉన్న లింకులేమిటో అర్ధమవుతుందన్నారు. టీడీపీ హయాంలో జాస్తి కృష్ణకిశోర్ టీడీపీకి అనుకూలంగా పనిచేయడం వల్లే... ఇఫ్పుడు చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు.