English | Telugu

ఆరేళ్లు ఒకటే కాయ అదీ జ‌న‌సేన లెక్క‌!

ఎన్టీఆర్ 9 నెల‌ల్లో రాష్ట్ర రాజ‌కీయాల‌నే మార్చి వేశారు. అన్న‌ చిరంజీవి 8 నెల‌ల్లో 18 సీట్లైనా ఖాతాలో వేసుకున్నారు. నాకు తిక్క వుంది కానీ దానికి ఒక లెక్క‌వుందంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పెట్టి ఆరేళ్ళైనా ఒక్క‌టంటే ఒక్క సీటు గెలిపించుకున్నారు. తాను రెండు చోట్ల ఓడిపోయారు. అప్ప‌ట్లో బీజేపీ - టీడీపీతో పొత్తు పెట్టుకొని టిడిపిని గెలిపించారు. 2019 ఎన్నిక‌ల్లో సీపీఎం, బీఎస్పీతో క‌లిసి పోటీ చేశారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో తుస్సు మ‌న్నారు. తాజాగా బిజెపితో క‌లిసి స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చూప‌డానికి పంచ్ డైలాగ్‌లు చెబుతున్నారు. స్థానిక స‌మ‌రంలోనైనా ప‌రువు కాపాడుకోవ‌డానికి రాజ‌మండ్రి వేదిక‌గా జ‌రిగే స‌మీక్ష‌లో ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేయ‌నున్నారు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మార్చి 14 నేటికి ఆరు సంవత్సరాలు అవుతుంది. ఆరో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఐతే... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమాల్ని సాదాసీదాగా నిర్వహించనున్నారు. ఇవాళ ఏం చేసినా, ప్రతీ లెక్కా ఈసీకి నివేదించాల్సిందే. అందువల్ల వేడుకల్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి వేడుకలకు రాజమహేంద్రవరం (రాజమండ్రి) వేదిక అయింది. జననేత శ‌నివారం ఉదయం విమానంలో మధురపూడి చేరుకుని అక్కడ నుంచి రాజమహేంద్రవరంకు వెళ్ళారు. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఆరేళ్లలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. ధవళేశ్వరం రామపాదాల రేవు వద్ద ‘మన నది - మన నుడి’ కార్యక్రమంలో భాగంగా గోదావరికి హారతి ఇచ్చి రచ్చబండ నిర్వహించున్నారు.

ఆవిర్భావ సమావేశం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని షెల్టాన్‌ హోటల్‌లో జరుగుతోంది. పార్టీ ఆవిర్భవించిన తరువాత ఆరేళ్లలో చేసిన పోరాటాలు, సాధించిన ప్రగతి, ఇబ్బందులు తదితర విషయాలను సమీక్షించి భవిష్యత్‌ కార్యాక్రమాన్ని రూపొందించ‌నున్నారు. ఆదివారంనాడు వివిధ వర్గాల మేధావులతో తెలుగభాష పరిరక్షణ కోసం షెల్టాన్‌లో సమీక్షిస్తారు. ప్రభుత్వం తెలుగు మీడియం రద్దు చేయడాన్ని వ్యతిరేకించడంతో పాటు ఒక ఉద్యమంగా భాషా పరిరక్షణ కోసం ఉపక్రమించ‌నున్నారు. పిల్లలతో నదీ పరిరక్ష ణ గురించి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడతారు. ఇది ఓ రచ్చబండ కార్యక్రమంలా నిర్వహించనున్నారు. 15న కవులు, సాహితీవేత్తలతో సమావేశ మై, తెలుగుభాష పరిరక్షణ గురించి చర్చిస్తారు. సాహితీవేత్తల అభిప్రాయాలతో కొన్నినిర్ణయాలు తీసుకుని, తెలుగుభాషా పరిరక్షణ కార్యక్రమాలు చేపడతారు.

వైసీపీపై పోరాటానికి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆరంభంగా చేసుకోవాలని జనసేన భావించింది. ఐతే... 144 సెక్షన్ అమల్లో ఉండటం వల్ల... బహిరంగ సభలు చేపట్టేందుకు చాలా షరతులు తప్పవు. ఏదైనా సభ నిర్వహించినా... దానికి అయ్యే ఖర్చులు... అభ్యర్థుల ఖర్చుల లిస్టులో చేరతాయి. అందుకే జనసేన పార్టీ బహిరంగ సభ బదులు ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది.

2014 మార్చి 14న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్టీని లాంచ్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - టీడీపీతో కలసి జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి విజయం సాధించింది. అయితే, టీడీపీ, బీజేపీ పోటీ చేశాయి. జనసేన మాత్రం పోటీ చేయలేదు. అయితే, 2014 - 19 మధ్య రాజకీయాలు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీఎస్పీతో కలసి ఎన్నిక‌ల బరిలో దిగారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన తరఫున కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఓడిపోయారు.

2019 ఎన్నికల తర్వాత బీజేపీకి పవన్ కళ్యాణ్ దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని తాజాగా విజన్ డాక్యుమెంట్‌ను కూడా రిలీజ్ చేశాయి. జ‌న‌సేన భ‌విష్య‌త్ గురించి ఈ స‌మావేశంలో 2024లో అధికారంలో రావ‌డానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై కూడా చ‌ర్చిస్తున్నారు.