English | Telugu
ప్రపంచ రాజకీయాల్లో సంచలనం జేసిండా అర్డెర్న్..!
Updated : Oct 19, 2020
సంచలనాత్మక నిర్ణయాలకు, సరికొత్త రికార్డు లకు పెట్టింది పేరు జేసిండా అర్డెర్. న్యూజిలాండ్ ప్రధానిగా చిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టారు. దేశ పరిపాలనా బాధ్యతతో పాటు తల్లిగా బిడ్డ పెంపకం బాధ్యతను కూడా సమర్ధవంతంగా నిర్వహించారు. మూడు నెలల పాపాయితో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. దేశపరిపాలన, బిడ్డ ఆలనాపాలన రెండింటికీ ప్రాధాన్యత ఇస్తున్న ఆమె నిబద్ధతను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ కొనియాడారు.
ఇంత ఘనత సాధించిన జేసిండా న్యూజిలాండ్ లోని హోమిల్టన్ లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి రోజ్ అర్డెర్న్ పోలీసు డిపార్ట్మెంట్ లో చిన్న ఉద్యోగి. తల్లి లారెల్, ఇద్దరూ అడపిల్లలే. పెద్దామ్మాయి లూయిస్, రెండో అమ్మాయి జేసిండా. చిన్నప్పటి నుండి కష్టించే పనిచేసే గుణం జేసిండా సొంతం. స్కూల్ లో టీచర్ పెద్దయ్యాక నువ్వు ఏం అవుతావు అని అడిగితే పొలిటీషియన్ అంది. ఇలా రాజకీయాలపై ఆమెకు ఉన్న ఆసక్తిని టీచర్లు మరింత పెంచారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆ దేశ ఎంపీ మారలిన్ వారన్ ఇంటర్వ్యూ చేసి స్కూలులో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆమె స్పూర్తితో మానవ హక్కుల సంఘం లో కార్యకర్తగా చేరింది. కాలేజీ రోజుల్లో కూడా విద్యార్థి నాయకురాలిగా చురుకైన పాత్ర పోషించింది. వైకాటో యూనివర్సిటీ లో పీజీ పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్ వెళ్లింది. పదిహేనేళ్ళ వయసులోనే లేబర్ పార్టీలో చేరి సభలు, సమావేశాల్లో పాల్గొంది. 2018లో మౌంట్ ఆల్బర్ట్ నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది. ఆ తర్వాత కొద్దికాలానికే లేబర్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. తొమ్మిదేండ్ల పాటు ప్రతి పక్ష హోదాలో ఉన్న లేబర్ పార్టీని గెలిపించడమే కాకుండా చిన్న వయసులో ప్రధాని గా రికార్డు సృష్టించింది. రెండోసారి ప్రధానిగా ఎన్నికై తన రికార్డును తానే బద్దలు కొట్టింది.
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ని పూర్తిగా అరికట్టేలా కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేసింది. కరోనా పరీక్షలు విస్తృతంగా చేస్తూ వైరస్ వ్యాప్తిని అదుపుచేయడంలో జేసిండా పోషించిన కీలక పాత్ర ఆమెను మరోసారి గెలిచేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.