English | Telugu

ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణం.. టెండరింగ్, పథకాలు అంటూ వైసీపీ సర్కార్ చేసిన నిర్వాకం!

సంక్షేమం, సమగ్రాభివృద్ధి రాష్ట్ర ప్రగతి రథానికి రెండు చక్రాలు ఇవే. కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సమాజంలోని అందరికీ పనికొచ్చే పనుల కంటే వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే పథకాలపైనే దృష్టి సారించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి దాకా జరిగిన ప్రతి క్యాబినెట్ సమావేశంలో సంక్షేమ పథకాల జాతరే కొనసాగుతుంది. పాదయాత్రలో వచ్చిన వినతుల ఆధారంగా రూపొందించిన మేనిఫెస్టోను జగన్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని పదేపదే చెబుతున్నారు. అందులో పొందు పరిచిన నవరత్నాలు అమలు పైనే పూర్తిగా దృష్టి సారించారు. మ్యానిఫెస్టోను ప్రతి కార్యాలయంలో ప్రదర్శించాలని కూడా ఆదేశించారు.

అక్రమ కట్టడం అంటూ స్వయంగా ప్రభుత్వానికి చెందిన ప్రజావేదిక కూల్చివేతతో ప్రభుత్వ పాలన మొదలైంది. జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్నింటికీ బ్రేక్ వేశారు, రివర్స్ టెండరింగ్ అన్నారు. ఇందులో భాగంగా అమరావతి, పోలవరంతో పాటు అన్ని ప్రధాన ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పోలవరంలో రివర్స్ టెండరింగ్ వల్ల రూ.638 కోట్ల రూపాయలు ఆదా అయినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంది. కానీ కాంట్రాక్టు దక్కించుకున్న ఆ సంస్థ ఇసుక ఖర్చు ప్రభుత్వమే భరించాలని జీఎస్టీతో పాటు టెండర్లలో పేర్కొన్నని ఇతర పనులకు చెల్లించాలని మెలిక పెట్టడంతో ఈ భారం రూ.500 కోట్లకు పైనే పడింది.

అమరావతి నిలిపివేత, రివర్స్ టెండరింగ్, పవన సౌర విద్యుత్ ఒప్పందాలపై పునఃసమీక్ష వంటి చర్యలు జాతీయ స్థాయిలో వివాదాస్పదమయ్యాయి. అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు గుడ్ బై చెప్పాయి. ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులకు ప్రతికూల వాతావరణం నెలకొందని విశ్లేషకులు పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా అంశాల పై జాతీయ పత్రికల్లో సంపాదకీయాలు ప్రత్యేక కథనాలు అనేకం వచ్చాయి. ఒక రాష్ట్రంలో పరిస్థితి పై అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లోనే ఈ స్థాయిలో జాతీయ మీడియా స్పందించడం బహుశా ఇదే మొదటి సారి.

పాలన ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం సహజం. కానీ వైసీపీ సర్కార్ కొత్త సంప్రదాయానికి తెరలేపింది. గ్రామ వార్డు సచివాలయాలకు వైసిపి రంగులు వేయాలంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వాటర్ ట్యాంకులకు అవే రంగును పూయాలని ఆదేశించింది. టిడిపి హయాంలో అక్కడక్కడ వాటర్ ట్యాంక్లు, శ్మశానాల గోడలకు పచ్చరంగు పులిమారు, దీనికి స్థానిక అధికారులు లేదా నేతల అత్యుత్సాహమే కారణం. వైసీపీ సర్కార్ ఏకంగా అధికారిక ఉత్తర్వులు ఇవ్వడంతో కింది స్థాయి నేతలు రెచ్చిపోతున్నారు. చివరికి గాంధీ విగ్రహం దిమ్మకు వైసీపీ రంగులు పులుముతున్నారు.

నిరుపేదలు,కూలీల కడుపు నింపే అన్న క్యాంటీన్ల మూసివేత పై ఎన్ని విమర్శలు, వినతులు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. రాష్ట్ర సర్వ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక హోదాయే మార్గం. దీనికోసం కేంద్రంతో పోరాడతామని విపక్షంలో ఉండగా పదేపదే ప్రకటించిన జగన్ అధికారంలోకి రాగానే దానిపై నోరు కూడా మెదపడం లేదు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి హోదా గురించి అడుగుతూనే ఉంటా అంటూ నిస్సహాయత ప్రదర్శించారు.

జగన్ సర్కార్ 6 నెలలు పూర్తి చేసుకోగా అందులో 5 నెలలకు పైగా ఇసుక కొరత వెంటాడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పనులు లేక భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం కొత్త పాలసీ పేరిట ఇసుక తవ్వకాలు నిలిపి వేయడం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం. భారీ వరదల వల్ల కూడా రీచ్ లు మూతపడ్డాయి. ఇప్పుడు ఇసుక అందుబాటు పెరిగింది కానీ ధర మాత్రం అధికం గానే ఉంది. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. బడ్జెట్ తలకిందులవుతుంది. ఆదాయం అంచనాకు..ఆస్తుల ఆదాయానికి మధ్య రూ.80,000 కోట్ల వరకు తేడా ఉంటుందని తాజా అంచనా. వచ్చిన డబ్బు వచ్చినట్లుగా సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తుండటం, ఆదాయం పడిపోవడంతో అభివృద్ధి పనులకు నిధులు వెతుక్కోవాల్సి వస్తోంది. జనవరిలో మరిన్ని కొత్త పథకాలు వస్తుండడంతో పరిస్థితి దయనీయంగా మారుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.