English | Telugu
సౌదీ అరేబియా తీరంలో ఇరాన్ కు చెందిన చమురు ట్యాంకర్ పై దాడి...
Updated : Oct 12, 2019
సౌదీ అరేబియా తీరంలో ఇరాన్ కు చెందిన చమురు ట్యాంకర్ పై దాడి జరిగింది. జెద్దా తీరంలో చమురు తీసుకెళుతున్న ఓడపై రెండు క్షిపణులు దాడి చేసినట్టుగా ఇరాన్ మీడియా తెలిపింది. ట్యాంకర్ లో పేలుడుతో చమురు ఎర్ర సముద్రం లోకి లీకైంది. సౌదీ అరేబియా జెద్దాకు సమీపంలో ఉన్న తీరం వద్ద ఇరాన్ కు చెందిన ఇంధన ట్యాంకర్ పేలింది.
ఇరాన్ కు చెందిన నేషనల్ కంపెనీ ఆయిల్ కూడా భారీ ఇంధనంతో వెళ్తుండగా జెద్దా పోర్ట్ కు అరవై నాటికల్ మైళ్ల దూరంలో మిస్సైళ్ల తో దాడి చేసినట్లు తెలుస్తుంది. ఓడలో ఉన్న రెండు ప్రధాన చమురు స్టోరేజీ ట్యాంకులు ధ్వంసమైనట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఎర్ర సముద్రంలోకి చమురు లీక్ అవుతోంది. ఓడను మిసైల్ ఢీకోట్టినట్లు ఆయిల్ కంపెనీ చెప్తుండగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇంకా బయటకు రాలేదు. ఇంధన ట్యాంకర్ ల నుంచి వెలువడిన మంటలను ఆర్పినట్లు ఇరాన్ ప్రకటించింది.
సౌదీ, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపధ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో సౌదీ అరేబియాలో ఉన్న అతిపెద్ద చమురు క్షేత్రం అరంకోకు చెందిన రెండు భారీ స్టోరేజ్ కేంద్రాలపై మిస్సైళ్ల దాడి జరిగింది. ఈ దాడులకు ఇరాన్ కారణమని అమెరికా సౌదీ దేశాలు ఆరోపించాయి. అయితే దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.