English | Telugu

విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు...

ప్రస్తుతం విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు అతి ధోరణి వల్ల వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మొన్నటి ఎన్నికల ముందు అవంతి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయనకు భీమిలి అసెంబ్లీ నియోజక వర్గం టికెట్ కేటాయించారు. అక్కడ ఆయన విజయం సాధించారు, అనంతరం ఆయనకు మంత్రి పదవి కూడా లభించింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్ కి విశాఖ దక్షిణ నియోజక వర్గం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు, అయినా ఆయనపై జగన్ కి సదభిప్రాయం ఉండటంతో ద్రోణంరాజు శ్రీనివాస్ కి ఎంతో ప్రతిష్టాత్మకమైన విఎంఆర్డీఎ చైర్మన్ పదవి దక్కింది. ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలసికట్టుగా పని చేశారు అయితే ఈ మధ్యన వలస నేతల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. ఎక్కడ అవకాశం దొరికినా మంత్రి అవంతి శ్రీనివాస్, ద్రోణంరాజు శ్రీనివాస్ పై సెటైర్ లు వేస్తున్నారు.

అయితే ద్రోణంరాజు సౌమ్యుడు, సహనశీలి ఈనేపధ్యంలో అవంతి శ్రీనివాస్ ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ సంయమనం పాటిస్తూ వచ్చారు. అయితే రానురాను అవంతి మాటల తీవ్రత ఎక్కువ కావడంతో ఇటీవల ద్రోణంరాజు ఘాటుగానే ఆయన బదులిచ్చారు. దీంతో మంత్రి అవంతి బిత్తరపోయారు, ఇటీవల విశాఖలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ వేదిక మీద అటు అవంతి ఇటు ద్రోణంరాజు ఒకరిపై మరొకరు కౌంటర్ లు వేసుకున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ వీ.ఎం.ఆర్.డీ.ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాటామాట అనుకోవడంతో వేదికపై ఉన్నవారితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా అవాక్కయ్యారు.

మంత్రి అవంతి తన ప్రసంగంలో ద్రోణంరాజును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా అంతే ధీటుగా ద్రోణంరాజు కూడా ప్రతిస్పందించారు. మంత్రి అవంతి ద్రోణంరాజు నుద్దేశించి అన్న శీనన్న పెదముషిడివాడలో ఉన్న మీకు పల్లెటూరి కష్టాలు తెలియవులే అరకు, పాడేరు వెళ్తే ఇబ్బందులు తెలుస్తాయి అని చురకంటించారు. అప్పటి వరకు ఎంతో సహనం వహించిన ద్రోణంరాజు మంత్రి ప్రసంగం ముగిసిన వెంటనే మైక్ అందుకుని ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అవంతి శ్రీనివాసరావు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కళాశాలలు పెట్టి కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు ఎంతో సంతోషం ఆయనపై నాకు గౌరవం ఉంది, నేను పుట్టింది కుగ్రామమైన జుత్తాడలో, రైతు కష్టాలను స్వయంగా చూశాను, గ్రామీణ ప్రాంతం, పట్టణం ఈ రెండింటిపైనా నాకు పూర్తి అవగాహన ఉంది అంటూ కౌంటరిచ్చారు. అంతేకాదు ఇలాంటి కార్యక్రమాల్లో వేరే విషయాలు మాట్లాడకూడదని కూడా సుతిమెత్తగా హెచ్చరించారు.

చిన్నా పెద్దా ఎవరైనా సభ్యత, సంస్కారం, గౌరవంతో మాట్లాడాలి అంటూ ద్రోణంరాజు మంత్రికి హితవుచెప్పారు. ఊహించని కౌంటర్ తో బిత్తరపోయిన మంత్రి అవంతి శీనన్న మీరు అపార్థం చేసుకున్నారు, గ్రామీణ ప్రాంతంలో ఇబ్బందులు చెప్పానంతే, మీకు తెలియదని కాదు, మీరంటే నాకెంతో గౌరవం ఉంది అంటూ వివరణ ఇచ్చుకున్నారు కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరూ అవంతి వైఖరని విమర్శించారు, దీంతోపాటు అటు ప్రధాన మీడియాలోను ఇటు సోషల్ మీడియాలోనూ ఈ అంశమే వైరలైంది. ద్రోణంరాజు శ్రీనివాసరావుపై వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం మంత్రి అవంతికి ఎందుకొచ్చిందంటూ పార్టీ కార్యకర్తలు చాలామంది అంతర్గతంగా ప్రశ్నించినట్టుగా సమాచారం. ద్రోణంరాజుపై మంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సెగలు రేపాయి. ఈ వ్యవహారం హైకమాండ్ వరకు వెళ్లిందని విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

పార్టీ హైకమాండ్ కూడా మంత్రి అవంతికకే చీవాట్లు పెట్టినట్లు వినికిడి. పార్టీ పరువుకు భంగం కలిగేలా వ్యవహరించవద్దని, అక్షింతలు వేసిందని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా భీమిలి నియోజకవర్గానికి చెందిన అవంతి వర్గీయులు రంగంలోకి దిగారు. విశాఖ పార్టీ కార్యాలయంలో కాకుండా సీతమ్మధారలోని నార్ల భవన్ లో విలేకరుల సమావేశం ఉందంటూ మీడియాకు కబురు పంపారు. అయితే ఈ సమావేశంలో ఎవరు మాట్లాడతారో మాత్రం పైకి చెప్పలేదు. తీరా ఆ సమావేశాన్ని కూడా వారు రద్దు చేసుకున్నారు. పార్టీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతోనే వారు విలేఖరుల సమావేశాన్ని రద్దు చేశారని సమాచారం. ఈ అంశంపై ప్రెస్ మీట్లు పెట్టి మరింత రచ్చ చేయొద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వారిని గట్టిగా హెచ్చరించారట.