English | Telugu
చిరు గట్టిగా మాట్లాడారనడం అవాస్తవం.. అసెంబ్లీలో బాలయ్య
Updated : Sep 25, 2025
జగన్ హయాంలో తెలుగుసినీ ప్రముఖులకు అవమానం జరిగిందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాటకృష్ణ అన్నారు. అసెంబ్లీలో గురువారం (సెప్టెంబర్ 25) మాట్లాడిన ఆయన జగన్ హయాంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు. అప్పట్లో సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగినా ఎవరూ గట్టిగా నిలదీయలేకపోయారన్నారు. సినీ సమస్యలపై చర్చించేందుకు జగన్‌తో జరిగిన సమావేశానికి తనకు ఆహ్వానం అందినా వెళ్లలేదని చెప్పారు. అయితే ఈ సందర్భంగా చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ సమావేశానికి అంగీకరించారని బీజేపీ సభ్యుడు కామినేని అన్నారు. అయితే కామినేని వ్యాఖ్యలను ఖండించిన బాలకృష్ణ ఎవరూ జగన్‌ను గట్టిగా అడగలేదనీ, చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగొచ్చాడని అనడం కరెక్ట్ కాదనీ స్పష్టం చేశారు. అప్పట్లో చిరంజీవిని అవమానించారన్నది ఓకే... కానీ ఆయన చెబితే జగన్ దిగొచ్చారన్నది మాత్రం వాస్తవం కాదన్నారు.
అలాగే ఇటీవల విడుదల చేసిన ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) జాబితాలో తన పేరు తొమ్మిదో స్థానంలో ఉండటంపై కూడా బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌తో మాట్లాడినట్లు చెప్పారు.