కరోనా విలయతాండవంతో ప్రపంచం మొత్తం కుదేలవుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ధాటికి భారత ఆర్ధిక రంగం కూడా ప్రభావితమైంది. తాజాగా కరోనా వ్యాక్సిన్, కరోనా వైరస్ దేశంలో సృష్టిస్తున్న ఆర్ధిక విధ్వంసం పై ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. భారత్ లో వచ్చే తోలి వ్యాక్సిన్ ఆక్స్ ఫర్డ్ దే కావచ్చని అది కూడా రావడానికి ఆరు నుండి తొమ్మిది నెలల సమయం పట్టవచ్చని అయన తెలిపారు. భారత్ లో ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దానితో రోజుకు కోటిమంది చొప్పున వ్యాక్సిన్ ఇవ్వటం ప్రారంభించినా, మొత్తం దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలంటే కనీసం 140 రోజులు పడుతుందన్నారు. ఐతే వ్యాక్సిన్ కోసం నిరీక్షించకుండా కరోనా చికిత్స కోసం ఆసుపత్రుల్లో మరిన్ని ఏర్పాట్లు చేయాలని, మరీ ముఖ్యంగా టైర్-2,3 సిటీస్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశంలో మొదటి నుండి ప్రజా ఆరోగ్య వ్యవస్థ పై ప్రభుత్వాలు సరిగా దృష్టి పెట్టలేదని దాంతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారా మాత్రమే మనం కరోనాను ఎదుర్కోగలమని అయన అన్నారు.
లీడింగ్ ఇండియా డిజిటల్ రివల్యూయేషన్ లో చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశంలో జీడీపీ వృద్ధి 1947నాటికి పడిపోయే ప్రమాదం ఉందని, అసలు మైనస్ లోకి పోయినా ఆశ్చర్యమేమీ లేదంటూ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా కనుమరుగయ్యాయని, దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడాలంటే సొంతూర్లకు వెళ్లిపోయిన 14 కోట్ల మంది జనాభా తిరిగి పనులకు చేరుకోవాలని అయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొత్త వ్యవస్థల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అయన అన్నారు.