English | Telugu
భారతీయులూ అప్రమత్తంగా ఉండండి.
Updated : Mar 28, 2020
భారత దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా పోరాడుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 14 వరకూ దేశం మొత్తం లాక్ డౌన్. ప్రజలకు భయపడకండి మేమున్నాం అని ప్రభుత్వాలు ధైర్యం చెప్తున్నాయి. ప్యాకేజీలు కూడా ప్రకటించాయి. ఇదిలా ఉండగానే..కరోనా విషయంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ నివేదిక ఒకటి స్పష్టం చేసింది. ఇండియాలో వచ్చే మే నెల నాటికి 10 నుంచి 13 లక్షల మందికి కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశోధనా బృందం ఒకటి తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఈ వ్యాధి వ్యాపిస్తున్న విధానాన్ని పరిశీలించి, దాని ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. కోవిండ్-19(COV-IND-19) అనే అధ్యయన బృందం ఈ నివేదికను రూపొందించింది.
వైరస్ తొలిదశ వ్యాప్తిలో అమెరికా, ఇటలీ వంటి దేశాలతో పోలిస్తే, భారతదేశం మెరుగ్గానే కరోనా కేసులని నియంత్రించగలిగిన మాట వాస్తవమేనని, కానీ విస్తృతంగా నిర్థారణ పరీక్షలు చేయలేకపోవడం ఇండియా ప్రధాన లోపంగా కనిపిస్తోందని ఈ పరిశోధకులు అంటున్నారు. పరీక్షా కేంద్రాలు చాలా తక్కువగా ఉండటం, ఫలితాల ఖచ్చితత్వం, ఎంతమంది వైరస్ బారిన పడిన వారు పరీక్షలు చేయించుకోగలుగుతున్నారు వంటి అంశాలు కరోనా విస్తృతిని అర్థం చేసుకోడానికి ముఖ్య అంశాలని, ఇండియాలో ఈ సమాచారం సమగ్రంగా లేదని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటి శాస్త్రవేత్త దేబశ్రీ రాయ్ అన్నారు.
ఇప్పటిదాకా, ఇండియాలో టెస్టులు చేసిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. అందువల్ల, ఎంతమందికి వాస్తవంగా ఈ వైరస్ సోకిందో చెప్పలేని పరిస్థితి ఇండియాలో నెలకొని ఉందని ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు. మన దేశంలో కరోనా కేసులు చాలా తక్కువగా రిపోర్టు అవుతున్నాయని, అందుచేత ప్రస్తుత లెక్కలని నమ్మలేమని అంటున్నారు.
మార్చి 16 వరకూ రిపోర్టయిన కేసుల ఆధారంగా వేసిన లెక్కల ప్రకారంగా మే నెల నాటికి కరోనా కేసుల సంఖ్య దేశంలో పది లక్షలు దాటొచ్చనేది అంచనా. అయితే, ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలను బట్టి ఈ సంఖ్య తగ్గొచ్చు అని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ పరిశోధనలో ఢిల్లీ స్కూలు ఆఫ్ ఎకనామిక్స్, అలాగే అమెరికాలోని జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటికి చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు.
సాధారణ పరిస్థితుల్లోనే పేషెంట్ల తాకిడిని తట్టుకోలేని వైద్యఆరోగ్య వ్యవస్థ భారతదేశంలో ఉన్నదని, అలాంటిది ఒక్కసారిగా ఒత్తిడి ఎక్కువైతే వైద్యరంగం కుప్పకూలే అవకాశం ఉందని రిపోర్టులో అన్నారు. ఇండియాలో పదివేల మందికి 7 బెడ్లు ఉన్నాయి. అదే ఫ్రాన్సులో 65, దక్షిణ కొరియాలో 115, చైనాలో 42, ఇటలీలో 34, అమెరికాలో 28 బెడ్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే, ముందుముందు పెరిగే కరోనా కేసులను ట్రీట్ చేయగల సామర్థ్యం మన ఆస్పత్రులకు లేదని అర్థం అవుతుంది.
ఇండియాలో మరో సమస్య ఏంటంటే, దేశంలో 110 కోట్ల మందికి, అంటే మెజారిటి ప్రజలకి ఎటువంటి ఇన్సూరెన్సు పాలసీ లేదు. దీనికి తోడు, దాదాపు 30 కోట్ల మందికి బీపీ ఉంది. కరోనా వైరస్ సోకిన వాళ్లు చనిపోవడానికి దోహదం చేసే అంశాల్లో బీపీ ప్రధానమైనది. కఠిన మైన చర్యలు తీసుకోకపోతే, ఇండియాలోని వైద్యఆరోగ్య వ్యవస్థ, ఇక్కడున్న ఆస్పత్రులు పెరగనున్న కరోనా పేషెంట్ల సంఖ్యతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమేరకు సత్ఫలితాలిస్తాయో చూడాలి. మనందరం స్వయం నిర్భందంలో ఉండడమే మనకు శ్రీ రామ రక్ష.