English | Telugu

పాతబస్తీలో రోడ్డెక్కిన మహిళలు! పతంగి పార్టీకి పతనమేనా? 

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయంటారు. రాజకీయాల్లో ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. అధికారం చలాయించిన పార్టీలు, నేతలకు అప్పుడప్పుడు అడ్డంకులు ఎదురవుతుంటాయి. పవర్ లో ఉన్నప్పుడు పెత్తనం చేసిన నేతలు.. టైం కలిసిరాకపోతే కనిపించకుండా పోతుంటారు. ప్రజాగ్రహం ముందు రాజ్యాలే కూలిపోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే ఎంతటి వారైనా తలొగ్గాల్సిందే. హైదరాబాద్ పాతబస్టీలోనూ ఇప్పుడు అలాంటి సీనే కనిపిస్తోంది. ముస్లిం సామాజిక వర్గమంతా తమవెంటే ఉందని, ఉంటుందనే ధీమాలో ఉన్న ఓ పార్టీకి ఇప్పుడుచుక్కలు కనిపిస్తున్నాయి. తమ పార్టీ గురించి కనీసం మాట్లాడేందుకు కూడా భయపడే ప్రజలు... తమకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుండంటతో ఆ పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారు.

పాతబస్తీలో పట్టుందని చెప్పుకునే ఎంఐఎం పార్టీకి తొలిసారి అక్కడ షాకిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓల్డ్ సిటీలో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ముస్లిం మహిళలు రోడ్డెక్కి ధర్నాలు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాతబస్తీలో వరద బీభత్సం స్పష్టించింది. వరద ముంచెత్తడంతో వందలాది కాలనీలు నీట మునిగాయి. వరద బాధితులకు కేసీఆర్ ప్రభుత్వం సాయం చేస్తోంది. నీట మునిగిన ఇంటి కుటుంబానికి 10 వేల రూపాయలు పరిహారంగా ఇస్తోంది. అయితే అధికార టీఆర్ఎస్ నేతలతో కలిసి ఎంఐఎం నేతలు వరద సాయంపంపిణిలో అక్రమాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిజమైన వరద బాధితులకు సాయం చేయకుండా.. తమ ఇష్టం వచ్చినవారికి డబ్బులు ఇస్తున్నారని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బాధితుల పేర్లతో లోకల్ లీడర్లే నగదు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

సర్కార్ చేస్తున్న వరద సాయమే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీని షేక్ చేస్తోంది. సాయం అందని బాధితులంతా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున బయటికి వచ్చి ప్రధాన రోడ్లపై భైటాయించి ధర్నాలు చేస్తున్నారు. ధర్నా చేయడమే కాదు ఎంఐఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ముస్లిం మహిళలు. గల్లీ గల్లీ మే షోర్ హై.. ఎంఐఎం చోర్ హై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ ధర్నాలు కూడా ఎక్కడో కాకుండా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహించే చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే ఇప్పుడురాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంఐఎంకు వ్యతిరేకంగా గతంలో నిరసనలు జరిగిన కార్యక్రమాలు జరగలేదు. అలాంటిది ఎక్కువగా ఇండ్లలోనే ఉండి ముస్లిం మహిళలే రోడ్డెక్కి పతంగి పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం సంచలనంగా మారింది.

ఎంఐఎంతో పాటు ముస్లింలకు తమ సర్కార్ ఎంతో చేసిందని గొప్పగా చెప్పుకునే గులాబీ పార్టీని టార్గెట్ చేస్తున్నారు పాతబస్తి ముస్లింలు. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ క్యా కియా? 90 పీకే సోగయా అంటూ మండిపడుతున్నారు ముస్లిం మహిళలు. బల్దియా మే క్యా కియా? కాయా పీయా సోగయా అంటూ కేసీఆర్ సర్కార్ పై, ఎంఐఎంపై తమ ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. వరదల సమయంలో పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్దరాత్రి ఒక్కసారిగా వరద రావడంతో ఏం చేయాలో తెలియక డాబాలపైకి చేరి ప్రాణాలు కాపాడుకున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు. వారంతా రెండు, మూడు రోజుల పాటు నీళ్లలోనే ఉన్నా స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కనీసం స్పందించలేదని వరద బాధితులు ఫైరవుతున్నారు. అప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో నిరసనలకు దిగారు.

ఓల్డ్ సిటీలో జరుగుతున్న తాజా పరిణామాలతో పతంగి పార్టీకి పతనం ప్రారంభమైందనే చర్చ జరుగుతోంది. నిజానికి హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా.. పాతబస్తి దశ మాత్రం మారలేదు. ఎంఐఎం వల్లే అభివృద్ధి జరగడం లేదనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఎన్నికలప్పుడు తప్ప మిగితా సమయాల్లో ఎంఐఎం ఎమ్మెల్యేలు, లీడర్లు జనాలకు అందుబాటులో ఉండరనే విమర్సలు ఉన్నాయి. పాతబస్తీలో తమకు పోటీగా మరో బలమైన పార్టీ లేకపోవడంతో పతంగి పార్టీ నేతలు ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయారని చెబుతారు. అయితే ప్రస్తుతం పాతబస్తి ప్రజల్లోనూ మార్పువచ్చిందని, అభివృద్ధి కోణంలో వారు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమంటున్నారు.

ఓల్డ్ సిటీలో మరో పార్టీ బలంగా పోరాడితే ఎంఐఎంకు పతనం తప్పదనే అభిప్రాయం ముస్లిం వర్గాల నుంచే వినిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వారు ఉదహరిస్తున్నారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మంచి విజయం సాధించింది. సీమాంచల్ లోని ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న 52 నియోజకవర్గాల్లో 40 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మోడీ సర్కార్ తీసుకువచ్చి త్రిపుల్ తలాఖ్ బిల్లుతో ముస్లిం మహిళల్లో మైండ్ సైట్ లో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ముస్లిం యువతలో కూడా కొంత మార్పు కనిపించిందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలనే భావనలో కమలానికి సపోర్ట్ చేశారనే చర్చ కూడా జరుగుతోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ ముస్లింలు ఎక్కువగా ఉండే దౌల్తాబాద్ లో బీజేపీకి గతంలో కంటే ఓట్లు భారీగా పెరిగాయి.

హైదరాబాద్ పాతబస్తీ ప్రజల్లోనూ ఇప్పుడు చాలా మార్పు వచ్చిందంటున్నారు. అభివృద్ధి, తమ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నేతలనే ఎన్నుకోవాలనే ఆలోచనకు ఓటర్లు వచ్చారని చెబుతున్నారు.ఈ పరిస్థితిని గమనించడం వల్లే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అప్రమత్తమయ్యారని, కొన్నిరోజులుగా పాతబస్తిలో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడుతున్నారని చెబుతున్నారు. వరదల సమయంలో బయటికి రాని ఎంఐఎం నేతలు.. నిరసనలు జరుగుతుండటంతో సాయం వేగవంతం చేశారని చెబుతున్నారు. ఒవైసీ బ్రదర్సే స్యయంగా బాధితులకు చెక్కులు ఇస్తున్నారంటే ఆ పార్టీ ఎంత ఆందోళనగా ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓల్డ్ సిటి పరిణామాలకు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ కొంత కష్టపడితే పాతబస్తిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఓల్డ్ సిటీ షేర్ గా చెప్పుకునే పతంగి పార్టీకి కలవరపడే పరిణామాలు జరగడం సంచలనమే.