English | Telugu

ఢిల్లీలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు... ఇప్పటివరకు 13మంది మృతి...

దేశ రాజధాని ఢిల్లీ రణరంగంగా మారింది. సీఏఏ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల ఘర్షణల్లో ఇప్పటివరకు 13మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అల్లర్ల నేపథ్యంలో, ఈశాన్య ఢిల్లీలో కర్ఫ్యూ విధించి, కనిపిస్తే ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఢిల్లీ-గజియాబాద్ రహదారిని మూసివేశారు. ఈశాన్య ఢిల్లీ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు ఆదేశించారు. 13 పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. పది సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కేంద్ర బలగాలను మోహరించారు. అయితే, కేంద్ర బలగాలను పెద్దఎత్తున మోహరించినా, ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు షాపులను, వాహనాలను తగలబెడుతున్నారు. ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. మౌజ్‌పుర్‌, జఫరాబాద్‌, చాంద్‌బాగ్‌, కరవాల్‌నగర్‌లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో డ్రోన్ల ద్వారా అల్లరి మూకలను గుర్తించి, వాళ్ల పని పట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక చర్యలు చేపట్టింది. స్పెషల్ పోలీస్ కమిషనర్ గా ఎస్ఎన్ శ్రీవాత్సను నియమించింది. ఢిల్లీలో పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా... అల్లర్లు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు, ఈశాన్య ఢిల్లీలో ఈరోజు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో, మీడియాకి కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ కీలక సూచనలు చేసింది. దేశ వ్యతిరేక కార్యకలపాలను ప్రోత్సహించేలా ప్రోగ్రామ్స్‌ను, వీడియోలను ప్రసారం చేయొద్దని సూచించింది. అలాగే, ఏదైనా మతాన్ని కానీ, కులాన్నీ కానీ కించపర్చేలా ఉన్న వీడియోలు గానీ... పదాలను గానీ, టీవీ చర్చా కార్యక్రమాల్లో ప్లే చేయకూడదని ఆదేశించింది. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా కార్యక్రమాలు ఉండకూడదని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ తన ప్రకటనలో తెలిపింది.