English | Telugu

వరంగల్ మెడికల్ కాలేజీలో సినీ ఫక్కీలో ఎలక్ట్రానిక్ మాస్ కాపీయింగ్

చదువుకొని టెక్నాలజీని డెవలప్ చేసేవాళ్ళు కొందరైతే.. చదవలేక టెక్నాలజీని ఉపయోగించి పరీక్షల్లో కాపీ కొట్టేవాళ్ళు కొందరు. అలాంటి ఆణిముత్యం తాజాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో దొరికింది. ఎన్నో సినిమాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో కాపీ కొట్టడం చూస్తుంటాం. ఇప్పుడు ఆ ఘనకార్యం వరంగల్ లో వెలుగులోకి వచ్చింది.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. అతడు చెవిలో మైక్రోఫోన్ పెట్టుకోగా, బయట కళాశాల ఆవరణలో కారులో కూర్చుని ఓ డాక్టర్ ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో సమాధానాలు అందించాడు. ఇది గమనించిన కళాశాల సిబ్బంది విద్యార్ధిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు విద్యార్థి నవంబరు 26,28, డిసెంబరు 3వ తేదీల్లో జరిగిన పరీక్షల్లో ఈ విధంగా కాపీయింగ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు, నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. పరీక్షలు రాయడం కోసం వైద్య విద్యార్థి ఓ డాక్టర్ సాయం తీసుకొని కాపీ కొట్టాడు. భవిష్యత్ లో పొరపాటున డాక్టర్ అయితే.. ఎవరైనా పేషెంట్ కి ఆపరేషన్ చేయాల్సి వస్తే.. ఇలాగే చెవిలో మైక్రోఫోన్ పెట్టుకోని మరో డాక్టర్ సాయంతో ఆపరేషన్ చేస్తాడా?.. వామ్మో ఇలాంటి వారిని వదిలేస్తే అంతే సంగతులు!!