English | Telugu

కరోనా వైరస్ ను ప్రభుత్వం ఎగదోస్తున్నట్లుగా ఉంది.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ తీవ్రత ను కట్టడి చేసే విషయంలో తీసుకుంటున్న చర్యలను హైకోర్టు తరచూ తప్పు పడుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ప్రతి రోజు చేస్తున్న కరోనా పరీక్షల సంఖ్య పైన కోర్టు సీరియస్ గా స్పందిస్తోంది. తాజాగా ఇప్పుడు కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి ఇస్తున్న పీపీఈ కిట్లు, గ్లౌజులు, ఎన్‌-95 మాస్కులు, ఇతర పరికరాల లభ్యత పై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇదే అంశాల పై వివరణ ఇవ్వడానికి గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్వయం గా కోర్టు ముందు ఈ రోజు హాజరై పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు సీజే ఆదేశించారు.

కరోనా ట్రీట్ మెంట్ కోసం బాధితులంతా గాంధీకే ఎందుకు వెళ్తున్నారు.. నిమ్స్ కు అలాగే ఇతర హాస్పిటల్స్ కు ఎందుకు వెళ్లడం లేదు. తమకు రక్షణ లేదని, పీపీఈ కిట్లు ఇతర మౌలిక వసతులు అందడం లేదని జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 70 మంది వైద్యులకు కరోనా సోకింది, 400 మంది వైద్య సిబ్బంది క్వారంటైన్ అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో గత 15 రోజులుగా కొనసాగుతున్న జూనియర్‌ డాక్టర్ల సమ్మె, వారి డిమాండ్లు ఏమిటో తెలపాలని హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందించడం లేదంటూ న్యాయవాది సమీర్‌ అహ్మద్‌ హైకోర్టు కు రాసిన లేఖను ధర్మాసనం సుమోటో పిల్ ‌గా విచారణకు స్వీకరించింది.

కరోనా పరీక్షా కేంద్రాల్లోని అధికారులు పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెబుతున్నారని, పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని ధర్మాసనం తెలిపింది. కరోనా చికిత్స అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్లు, మాస్కుల నిల్వలు ఏమేరకు ఉన్నాయన్నది అప్రస్తుతమని, చికిత్స అందించే సిబ్బందికి ఎన్ని ఇస్తున్నారన్నదే ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తెలంగాణలో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా అడ్వొకేట్ జనరల్ ప్రసాద తన వాదనలు వినిపిస్తూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని చెపుతూ వచ్చే 10 రోజులలో 50 వేల పరీక్షలు చేయబోతున్న విషయం తెలిపారు. ఐతే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రతి రోజు 200 కు పైగా కేసులు నమోదు దేనికి సంకేతం అని ప్రశ్నించింది. జిల్లాకో కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.