English | Telugu
అమరావతికి చేసిన ఖర్చు కూడా చెప్పలేరా.. జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్
Updated : Nov 24, 2020
ఈ కేసు విచారణ సందర్భంగా రాజధాని రైతుల తరుఫున లాయర్ మురళీధరరావు వాదిస్తూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం చేసి, వారి హక్కులను హరించేలా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వాదించారు. రైతుల భూములు తీసుకున్నందుకు ప్రతిగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయన గుర్తు చేశారు. ఆ మేరకు రైతులతో కుదిరిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం కుదరదని అయన స్పష్టం చేశారు. ‘‘రాజధానిని నిర్మిస్తామని భూములు తీసుకుని.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడం కుదరదు. రాజధాని వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ రాజధాని రైతులు, సాధారణ ప్రజలు ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం ముఖ్యమంత్రి ఆకాంక్షమేరకే జీఎన్‌రావు కమిటీని ఏర్పాటు చేసినట్లుంది. ఆ కమిటీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సంప్రదించలేదు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) కూడా అదే తరహాలో నివేదిక ఇచ్చింది. జీఎన్‌రావు కమిటీ, బీసీజీ రూపొందించిన నివేదికలు, ఆ నివేదికలను అధ్యయనం చేసి మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ రూపొందించిన నివేదిక ఒకే తరహాలో ఉన్నాయి’’ అని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తమకు సూచనలు చేయాలని బీసీజీని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదని అయన కోర్టుకు వివరించారు. అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాయం వివరణ తీసుకుంటామని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.
ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు రాజధానికి చేసిన ఖర్చుపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడమే కానీ.. ఇంత వరకూ అధికారిక లెక్కలు బయట పెట్టలేదు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతికి పైసా ఖర్చు పెట్టలేదని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ తో సహా పలువురు మంత్రులు, వైసిపి నాయకులు చెబుతూ వస్తున్నారు.ఇదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం దాదాపు పదివేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకున్న పలు సంస్థలు పనులు మధ్యలో నిలిపివేసాయి. ఒప్పందం ప్రకారం అలా పనులు నిలిపివేస్తే ప్రభుత్వం వాటికీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ వివరాలన్నీ చాలా రహస్యంగా ఉన్నాయి. ఈ మొత్తం వివరాలు బయటకు వస్తే అపుడు అమరావతి కోసం అసలు ఎంత ఖర్చు చేసారు అనే వివరాలు బయటకు వస్తాయి.