English | Telugu

మూడు రాజధానుల కేసులో సీఎం జగన్ తో పాటు ఇద్దరు మంత్రులకు హైకోర్టు నోటీసులు 

సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ ఏపీ సర్కార్ ఈ విషయంలో అడుగు ముందుకు వేయడం అటుంచి.. రోజూ తన పరువును పోగొట్టుకుంటోంది. తాజాగా మూడు రాజధానులకు సంబంధించిన కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ఈ కేసులో ఏకంగా సీఎం జగన్ తో పాటు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.

ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తోందంటూ ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లాగా, అధికారంలోకి రాగానే మరో లాగా జగన్ మాట మార్చారని పిటిషన్ లో రైతులు పేర్కొన్నారు. దీని పై ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇదే విషయం పై హైకోర్టులో ఇతరులు కూడా పిటిషన్లు దాఖలు చేసారు. ఈ పిటిషన్ల పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మొత్తం పిటిషన్లన్నిటికి కలిపి ఏపీ ప్రభుత్వం కేవలం ఒక్క కౌంటర్ ను మాత్రమే దాఖలు చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ప్రతి పిటిషన్ కు ఒక కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ, బీజేపీలకు కూడా కోర్టు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సెప్టెంబర్ 21వ తేదీ వరకు స్టేటస్ కోను పొడిగిస్తున్నామని హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ పిటిషన్ పై ప్రతి రోజూ విచారణ జరుపుతామని కూడా చెప్పింది. అయితే ఈ విచారణను ప్రత్యక్షంగా నిర్వహించాలా? లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలా? అనే విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది.