English | Telugu
ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు...
Updated : Oct 25, 2019
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పట్టణంలోని కోకాపేట జంక్షన్, తోటపాలెం నాయుడు, రాజీవ్ నగర్ కాలనీలలోఇళ్లల్లోకి మోకాళ్ల లోతు నీళ్లు వచ్చి చేరాయి. ఎస్ లింగాల వలస దగ్గర ఏడొంపుల గడ్డ వంతెన మీద నుంచి నీరు పొంగి పొర్లడంతో పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొబ్బిలి, ఎస్ కోటతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. విజయనగరం జిల్లాలోని సీతానగరం సమీపంలో గల సువర్ణముఖి నదిపైన వంతెన కుంగిపోయింది. దీంతో ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న రాకపోకలను అధికార యంత్రాంగం నిలిపివేసింది. ద్విచక్ర వాహనాలకు మాత్రమే వంతెన పై నుంచి అనుమతిస్తున్నారు.
కృష్ణాజిల్లా జగ్గయ్య పేట మండలం పరిధిలోని కృష్ణానది పరివాహక గ్రామాల్లో వరద నీటిలో పంట మునిగిపోయింది. మున్నేరు నది పోటెత్తడంతో రావిరాల గ్రామ పరిధిలోని ప్రత్తి, వరి, మిరప పంటలు నీట మునిగాయి. ముత్యాల గ్రామానికి ప్రధాన రహదారి పై చంద్రమ్మ కయ్యి పైకి నీరు చేరడంతో ముత్యాల, జగ్గయ్యపేట పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంటూరు జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కృష్ణా నదికి వరద ఉధృతి పెరగడంతో అచ్చంపేట, అమరావతి మండలాల్లోని పలు గ్రామాల్లో పంట నీట మునిగింది. అమరావతి నుంచి విజయవాడ మార్గంలో పెద్దమద్దూరు దగ్గర లెవల్ వంతెన నీట మునిగింది. దీంతో రవాణాకు తీవ్ర ఇబ్బందిగా మారింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏలేరు, సుద్దగడ్డ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏలేరు జలాశయం నుంచి ఏడు వేల క్యూసెక్యుల నీరు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డిలో జోరు వాన కురవగా మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసుకున్న మొక్కలు తడిసిపోయాయి.కూరగాయలు వరదలో కొట్టుకుపోయాయి. అటు వరంగల్ లోనూ భారీ వర్షం కురిసింది. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర ఓ ప్రైవేటు బస్సు వాన నీటిలో చిక్కుకుపోయింది. అల్పపీడన ప్రభావం శ్రీకాకుళం జిల్లా పై ఎక్కువగా కనిపిస్తుంది. భారీ వర్షాలకు పాలకొండ డివిజన్ లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజాంలోకి భారీగా వరద నీరు చేరడంతో వీధులు చెరువులను తలపిస్తున్నాయి.