English | Telugu

ఏపీ వైద్యారోగ్య మంత్రి ఇంటి పక్కన దుస్థితి ఇది... ఇక, రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందో?

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి... డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సొంత నియోజకవర్గం ఏలూరులో ప్రజల ప్రాణాలను భరోసా దొరకడం లేదు. వైద్యారోగ్య మంత్రి ఆళ్ల నాని నివాసానికి దగ్గరలో ఉన్న ఏలూరు పెద్దాసుపత్రిలో వైద్యం అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేరితే తిరిగి ప్రాణాలతో బయటపడతామనే నమ్మకం లేకుండా పోతోంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఎంతో మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏలూరు పెద్దాసుపత్రి వైద్యులు, సిబ్బంది రోగులను పట్టించుకోకుండా సొంత పనుల్లో మునిగితేలుతున్నారని అంటున్నారు. ఇటీవల ఆస్పత్రి ఆవరణలోనే డీజే పెట్టుకుని డ్యాన్సులేసిన వైద్యులు, సిబ్బంది... విధి నిర్వహణలోనూ అదే తీరుతో ఉంటున్నారని మండిపడుతున్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందిస్తామని జగన్ సర్కారు చెబుతుంటే... ఏలూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది మాత్రం ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు.

ఇటీవల కళ్లు తిరుగుతున్నాయంటూ ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఓ మహిళ... వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో క్షణాల్లో శవంగా మారింది. నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఇలా ఎంతోమంది రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, దాంతో ఈ హాస్పిటల్ కి రావాలంటేనే వణికిపోతున్నారని అంటున్నారు. జనరల్ వార్డులోకి పంపేసి చేతులు దులుపుకుంటున్న వైద్యులుచ ఆ తర్వాత చికిత్స కోసం రోగుల బంధువులు కాళ్లావేళ్లాపడ్డ రావడం లేదని ఆరోపిస్తున్నారు. రోగుల ప్రాణాలకే కాదు... మృతదేహాలకు కూడా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో రక్షణ కరువవుతోంది. పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకొస్తున్న మృతదేహాలను ఎలుకలు పీక్కుతినేస్తున్నాయి. పోస్టుమార్టం కోసం తీసుకొచ్చిన ఓ మృతదేహం కళ్లను ఎలుకలు తినేయడంతో రిపోర్టే తేడా వచ్చిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఇలా, ఒకటి కాదు రెండు కాదు.... అనేక దారుణాలకు ఏలూరు ప్రభుత్వాస్పత్రి కేంద్రంగా మారుతోంది. ఏకంగా, వైద్యారోగ్యశాఖ మంత్రి సొంత ఇలాకాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై రోగుల బంధువులు మండిపడుతున్నారు.

అయితే, ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోని పెద్దాసుపత్రిలోనే ఇలాంటి దుస్ధితి ఉంటే... ఇక, రాష్ట్రంలోని ప్రభుత్వాస్పుత్రుల్లో పరిస్థితి ఎలాగుందో ఊహించుకోవచ్చని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో... కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వాస్పతుల్లో వైద్యం అందిస్తామని చెబుతుంటే... స్వయంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఇలాకాలోని పెద్దాసుపత్రిలోనే వైద్యం అందక రోగులు మరణించడం విమర్శలకు తావిస్తోంది.