భారత్ చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి మన సైనికులు 20 మందిని చైనా బాలి తీసుకున్న నేపథ్యంలో దేశంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. దీని పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. చైనాకు అర్ధమయ్యే భాషలోనే మన దేశం జవాబివ్వాలని ప్రజలందరూ కోరుతున్నారు. తాజాగా "బాయ్ కాట్ చైనా" నినాదం అటు సోషల్ మీడియాలోనూ ఇటు పబ్లిక్ లోను జోరుగా వినిపిస్తోంది. చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఆ దేశ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలన్న డిమాండ్ ప్రజల నుండి బలంగా వినిపిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టింది. చైనాను ఆర్ధికంగా దెబ్బ తీసేలా కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంట్లో భాగంగా చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారీగా పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ శాఖల మంత్రులు, అధికారులతో చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఈ సంప్రదింపుల పూర్తైన తర్వాత ఆర్థిక మంత్రి ఆ ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకు వెళ్లి ఈ విషయంలో ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభత్వ రంగం లోని అన్ని శాఖలు తమ పరిధిలో చైనా ఉత్పత్తుల వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలని ఒక నిర్ణయానికి వచ్చాయని సమాచారం. అదే సమయంలో దాదాపు 300 రకాల చైనా ఉత్పత్తులపై కస్టమ్స్, దిగుమతి సుంకాలను భారీగా పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశ పారిశ్రామిక రంగానికి చైనా ఉత్పత్తుల అవసరం కూడా ఉంది. వీటిపై ఇంపోర్ట్ డ్యూటీలను పెంచడం ద్వారా దాని ప్రభావం దేశ పారిశ్రామిక రంగంపై ఎంతవరకు ఉండొచ్చన్న అంశాన్ని కూడా అనలైజ్ చేస్తున్నారు. కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచితే మోడీ బ్రెయిన్ చైల్డ్ అయిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోగ్రాం పై కూడా దెబ్బ పడొచ్చని కొంత మంది పారిశ్రామిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.