English | Telugu

తెలంగాణను 'హైటెక్ స్టేట్' గా మారుస్తున్న మంత్రి కేటీఆర్!!

రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలు, ఐటీ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు కేటీఆర్ కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న కంపెనీల కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కరీంనగర్ ఐటీ హబ్ ను ఈ నెల పధ్ధెనిమిదిన ప్రారంభించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ కంపెనీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పరిశ్రమలు, ఐటీ శాఖలపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని కెటిఆర్ తెలిపారు. టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్కులు, ఇతర మౌలిక వసతుల కల్పన, సంబంధిత కార్యక్రమాలపై కేటీఆర్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బండమైలారం, బండ తిమ్మాపూర్ వంటి పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. టీహబ్ రెండవ దశ భవనం త్వరలోనే పూర్తవుతుందని కేటీఆర్ చెప్పారు. దీంతో అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్ అందుబాటులోకి వస్తుందన్నారు. జూలైలో ప్రోటో టైపింగ్ సెంటర్ కూడా ఏర్పాటవుతోందని తెలిపారు.

హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేటీఆర్ తెలిపారు. ఆ మేరకు పార్కుల అభివృద్ధి, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించారని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని ఇప్పటికే వరంగల్ నగరంలో పలు ప్రముఖ కంపెనీలు తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు.