English | Telugu

మణిపూర్ లో‌ బీజేపీ ప్రభుత్వానికి షాక్.. అధికారంలోకి కాంగ్రెస్!!

పలు రాష్ట్రాల్లో విపక్ష పార్టీల నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వాలను విచ్చిన్నం చేస్తున్న బీజేపీకి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఊహించని షాక్ తగిలింది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ).. సీఎం బీరేన్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది. ఈ మేరకు తమ పార్టీకి చెందిన నలుగురు మంత్రుల చేత రాజీనామా చేయించింది. అలాగే, బీజేపీ సర్కార్‌కు మద్దతు ఇస్తున్న నలుగురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో దోస్తీకి గుడ్‌ బై చెప్పారు. ఊహించని విధంగా, అధికార పార్టీ బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వానికి గట్టి షాక్‌ ఇచ్చారు. ఈ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు.

దీంతో బీరేన్ సింగ్‌‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ క్రమంలో అసెంబ్లీలో బలనిరూపణ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్‌ పక్షనేత ఇబోబీ సింగ్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారని సమాచారం. విశ్వాసం కోల్పోయిన బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని కోరనున్నారని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. కాగా, రాజ్యసభ ఎన్నికల ముందు జరిగిన ఈ ఊహించని పరిణామం బీజేపీకి నష్టం కలిగించే అవకాశముంది.

కాగా, 2017లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను 28 సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయతే 21 సీట్లు గెలిచిన బీజేపీ ఇతర పార్టీల సాయంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా పరిణామాలతో బీజేపీ సంఖ్య 19కి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది.