English | Telugu

ఎల్వీ కి తప్పిపోయిన సీవీసీ ఛాన్స్!

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా సంజయ్‌ కొఠారీ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇప్పటివరకూ, ఏపీ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వీ సుబ్రహ్మణ్యానికే ఆ పోస్టు దక్కుతుందన్న ప్రచారానికి తేరా పడినట్లయింది. ఇప్పటి వరకు ఆయన రాష్ట్రపతికి కార్యదర్శిగా వ్యవహరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమక్షంలో కొఠారీ నేడు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) చీఫ్‌ పదవి గత జూన్‌ నుంచి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఓ ఉన్నతస్థాయి కమిటీ కొఠారీని సీవీసీ చీఫ్‌గా గత ఫిబ్రవరిలోనే సిఫార్సు చేసింది. కానీ, ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జాప్యం జరిగింది. కొఠారీ 1978 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. హరియాణా కేడర్‌లో పనిచేసిన ఆయన 2016లో పదవి విరమణ పొందారు. అనంతరం పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలెక్షన్‌ బోర్డ్‌(పీఈఎస్‌బీ) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కార్యదర్శిగా వెళ్లారు.