English | Telugu
రైతు బంధు రూల్ వరద సాయానికి వర్తించదా! అంతా కేసీఆర్ సర్కారే చేసిందా?
Updated : Nov 19, 2020
ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. 2018 అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు సాయాన్ని ఆపాలని విపక్షాలు కోరినప్పుడు ఎన్నికల సంఘానికి ప్రభుత్వం తరపున వివరణ ఇచ్చింది.. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న పార్థసారథే. అప్పుడు ఆయన వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరిగా ఉన్నారు. రైతు బంధు పాత పథకమేనని ఎన్నికల అధికారులకు వివరణ ఇచ్చి నిధుల పంపిణికి ఆయన క్లియరెన్స్ తీసుకున్నారు. అప్పుడు ఆన్ గోయింగ్ కు పథకానికి ఎన్నికల కోడ్ వర్తించదని వాదించిన పార్థసారథి.. ఇప్పుడు ఎన్నికల అధికారిగా ఉంటూ ఆన్ గోయింగ్ స్కీంను కోడ్ పేరుతో ఆపేయాలని అదేశించడం చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం పంపిణి కూడా ఎప్పుడో నెల క్రితమే ప్రారంభమైంది. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ మూడు రోజుల క్రితం వచ్చింది. వరద సాయం నెల రోజుల నుంచి కొనసాగుతుంది కాబట్టి.. అది ఆనో గోయింగ్ స్కీం కిందకే వస్తుందని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ విషయాన్ని ఎన్నికల అధికారులకు వివరించి క్లియరెన్స్ తీసుకోవచ్చనే అభిప్రాయం వస్తోంది. గ్రేటర్ లో చేస్తున్నది వరద సాయం. వరదలు విపత్తు కిందకు వస్తాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్నికల కోడ్ కు మినహాయింపులు ఉంటాయి. గతంలో చాలా సార్లు అలా జరిగింది. వరద విపత్తు సాయం చేస్తున్నామని సర్కార్ చెప్పినా ఎన్నికల సంఘం ఈజీగానే కన్విన్స్ అవుతుందని చెబుతున్నారు.
వరద సాయం చేయాలని సర్కార్ కు చిత్తశుద్ది ఉంటే ఎన్నికల కోడ్ అడ్డంకే కాదని నిపుణులు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా విపక్షాలను టార్గెట్ చేయడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. విపక్షాలను బూచిగా చూపుతూ అడ్డదారుల్లో తప్పించుకునేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేసిందనే విమర్శలు వరద బాధితుల నుంచి వస్తున్నాయి. వరద సాయం పేరుతో గులాబీ నేతలకు వందల కోట్లు దోచి పెట్టి ఖజానా ఖాళీ చేసిన కేసీఆర్ సర్కారే.. నిజమైన లబ్దిదారులకు ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో ఇలా ఎన్నికల సంఘం పేరుతో డ్రామాలు చేసిందనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో రైతు బంధు నిధులు ఆపకుండా ఇచ్చినట్లుగానే వరద సాయం పంపిణి కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి వరద సాయం కోసం 550 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. అందులో ఇప్పటికే 5 వందల కోట్లను పంపిణి చేశారని అధికారిక లెక్కలె చెబుతున్నాయి. అయితే నిజమైన లబ్దిదారుల్లో కొంత మందికి మాత్రమే సాయం అందింది. వరద సాయం పేరుతో టీఆర్ఎస్ నేతలే డబ్బులు కాజేశారనే ఆరోపణలు వస్తున్నాయి. సాయం కోసం వరద బాధితులు ధర్నాలు చేస్తుండటంతో మరో వంద కోట్లు పంపిణి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇవి కూడా పార్టీ నేతలు కాజేస్తారనే భయంతో మీసేవా కేంద్రాల ద్వారా ఇవ్వాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రభుత్వం మరో 10 వేల మందికి సాయం చేయాలని భావిస్తే.. పరిస్థితి మాత్రం మరోలా మారింది. మూడు రోజుల్లోనే మీసేవా కేంద్రాల ద్వారా లక్షలాది దరఖాస్తులు వరద సాయం కోసం వచ్చాయి. దీంతో ఏం చేయాలో తెలియక ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా వాయిదా వేయింది అడ్డుకుందనే విమర్శలు వస్తున్నాయి. వచ్చిన దరఖాస్తుదారులందరికి సాయం చేయాలంటే మరో నాలుగు, ఐదు వందల కోట్లు కావాలి. అంత డబ్బు సమకూర్చడం కష్టమని భావించిన ప్రభుత్వమే విపక్షాలను బూచిగా చూపి వరద సాయం ఆపిందనే చర్చ జనాల్లో జరుగుతోంది.
మరోవైపు వరద సాయానికి బ్రేక్ పడటంతో బాధితులు భగ్గుమంటున్నారు. వరద సాయం పంపిణి నిలిపివేతపై రాజకీయ మంటలు రేగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద సాయం ఆగిపోవడానికి బీజేపీనే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బాధితులందరికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సాయాన్ని ఆపాలని న్నికల సంఘానికి తాను లేఖ రాయలేదని చెప్పారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీ ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. వరద సాయాన్ని బీజేపీ ఆపిందని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేస్తావా? అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్.