English | Telugu
డిసెంబర్ 1నే పోలింగ్ ఎందుకు?
Updated : Nov 19, 2020
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగబోతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో పోలింగ్ ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా పోలింగ్ ను మరింత ముందుకు తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. విపక్షాలకు ప్రచారం కోసం సరైన సమయం దొరకకుండా చేసేందుకు పోలింగ్ తేదీని ముందుకు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. అయితే డిసెంబర్ 1న పోలింగ్ జరపడం వెనక అధికార పార్టీ నేతల మాస్టర్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. విపక్షాలకు సమయం తక్కువగా ఉండేలా చూడటంతో పాటు తమకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని భావిస్తున్న ఉద్యోగుల ఓటింగ్ శాతం తగ్గేలా టీఆర్ఎస్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ పోలింగ్‌పై లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ పడేలా షెడ్యూల్ రూపొందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరిగే డిసెంబర్ 1 మంగళవారం. ఆ రోజు పోలింగ్ హాలీడే ఉంటుంది. వీకెండ్‌లో భాగంగా శని, ఆదివారాలు సెలవులు. సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా సెలవు ఉంది. ఇలా వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్ లో ఉండే ఉద్యోగులు సొంతూర్లకు వెళ్లడమో, టూరిస్టు ప్రాంతాలకు వెళ్లడమో చేస్తారనేది గులాబీ ఆలోచనగా ఉందని చెబుతున్నారు.
కేసీఆర్ సర్కార్ పాలన, టీఆర్ఎస్ పై ఉద్యోగులు కొంత కాలంగా ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల కాలంలో అది మరింత తీవ్రమైంది. మూడేండ్లు అవుతున్నా పీఆర్సీ ప్రకటించకపోవడం, ప్రమోషన్లను పట్టించుకోకపోవడం, బదిలీలు చేయకపోవడం వంటి అంశాల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలపైనా వారు మండిపడుతున్నారు. కేసీఆర్ పై కోపంగా ఉద్యోగులంతా గ్రేటర్ ఎన్నికల్లో కచ్చితంగా కారుకు వ్యతిరేకంగానే ఓటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఉద్యోగులు బీజేపీకి మద్దతిచ్చారని చెబుతున్నారు. ఇవన్నిలెక్కలు వేసిన అధికార పార్టీ.. వ్యూహాత్మకంగా వరుసగా సెలవులు వచ్చేలా చూసుకుని పోలింగ్ తేదిని నిర్ణయించందనే ఆరోపణలు వస్తున్నాయి. వరుస సెలవులు రావడంతో కొంతమంది ఉద్యోగులైనా టూర్లకు వెళతారని, అది తమకు కలిసి వస్తుందని గులాబీ నేతల వ్యూహమని తెలుస్తోంది.
నాలుగు రోజులు సెలవులు వస్తుండటంతో ఏపీకి చెందిన ఓటర్లు కూడా సొంతూర్లకు వెళ్లవచ్చనే చర్చ జరుగుతోంది. ఇది కూడా టీఆర్ఎస్ కు కలిసి వస్తుందని భావిస్తున్నారు. తమకు ఇబ్బంది లేకుండా చూసుకుని డిసెంబర్ 1 గ్రేటర్ పోలింగ్ జరిగేలా టీఆర్ఎస్ చూసిందని, అయితే లాంగ్ వీకెండ్ ప్రభావంతో గ్రేటర్ లో పోలింగ్ శాతం తగ్గవచ్చనే ఆందోళన కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. మాములుగానే హైదరాబాద్ లో పోలింగ్ తక్కువగా జరుగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరింత తగ్గుతుంది. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 42.04కాగా.. 2016లో 45.29 శాతంగా నమోదైంది.