English | Telugu

వరంగల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. పవన్ అభిమానులు ఐదుగురు దుర్మరణం!

ఈ తెల్లవారుజామున వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దామెర మండలం పసరగొండ దగ్గరలో ఈ ఘటన జరిగింది. మరణించిన వారంతా జిల్లాలోని పోచం మైదాన్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయడానికి రెండు గంటలు శ్రమించినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రాథమిక ఆధారాలను బట్టి, ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ శ్రీనివాస్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టుగా తెలిపారు.

కాగా, రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు యువకులు పవన్ కళ్యాణ్ అభిమానులని తెలుస్తోంది. ఈరోజు పవన్ పుట్టినరోజు కావడంతో రాత్రి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మరోవైపు, చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా పవన్ అభిమానులు ముగ్గురు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తగిలి మరణించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు.