English | Telugu

ఏపీలో రెచ్చిపోతున్న చేపల మాఫియా.. పేద మత్స్యకారుల కడుపు కొడుతున్నారు!

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో చేపల మాఫియా రెచ్చిపోతోంది. అధికారుల అండదండలతో డ్యాములోని లోతట్టు ప్రాంతంలో నివాసాలను ఏర్పాటు చేసుకొని మరీ మత్స్య సంపదను ఆ మాఫియా కొల్లగొడుతుంది. నిషేధిత అలివి వలలతో రాత్రి పగలు చేపలను వేటాడుతూ స్థానిక మత్స్యకారుల కడుపు కొడుతున్నారు. అడ్డొచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జలాశయ సంపదను కాపాడాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తిపడి వాళ్ళకి సహకరిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

నెల్లూరు జిల్లా ప్రజలకు వరప్రదాయిని సోమశిల జలాశయం. జిల్లా ప్రజలకు సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడమే కాకుండా పక్కనే ఉన్న చెన్నై నగర ప్రజలకు కూడా దాహార్తిని తీరుస్తోంది. స్థానిక మత్స్యకారుల ఉపాధి కోసం ప్రభుత్వం ఏటా లక్షలు వెచ్చించి చేప పిల్లలను సోమశిల డ్యామ్ లో వదులుతూ వుంటుంది. జలాశయం వద్ద మొత్తం 400 ల నుంచి 600 ల వరకు ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందిన మత్స్యకారులు ఉన్నారు. వీరంతా నిరుపేదలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యాముల్లో చేపలు వేటాడి.. వాటితో వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలా ప్రశాంతంగా సాగిపోతున్న మత్స్యకార కుటుంబాల్లోకి చేపల మాఫియా రాకతో ఉపాధి కరువైంది. సోమశిల జలాశయంపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు చెన్నై, కాకినాడ, రాజమండ్రి నుంచి ఇక్కడికి చేరుకుని స్థానిక బడా వ్యాపారులతో కలిసి జలాశయంలో పాగా వేశారు. డ్యామ్ లోతట్టు ప్రాంతంలో తాత్కాలిక నివాస స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పగలు అక్కడే ఉంటూ అలవి వలతో చేపలను పడతారు. వారి వేట కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

అలవి వేటతో జలాశయంలో మత్స్య సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం వేటను పూర్తిగా నిషేధించింది. అయితే చేపల మాఫియా జలాశయంలో సుమారు 80 అలివి వలలు వినియోగిస్తున్నట్లు తలుస్తోంది. అన్ని వలలతో కలిపి రోజుకు సుమారు 50 టన్నుల చేపలు పడుతోందని జాలర్లు వెల్లడిస్తున్నారు. కిలో సగటున 40 రూపాయల చొప్పున విక్రయించిన రోజుకు 20 లక్షల రూపాయల విలువైన మత్స్య సంపద అక్రమంగా తరలిపోతోంది. కాగా గతంలోనే డ్యామ్ లో అలివి వలలు వాడుతున్న విషయాన్ని తెలుసుకున్న అప్పటి జిల్లా కలెక్టర్ జానకి గట్టి చర్యలు తీసుకున్నారు. కడప, నెల్లూరు జిల్లాల నుంచే జాలర్లు ప్రవేశిస్తున్నట్లు తెలుసుకున్న కలెక్టర్ రెండు జిల్లాల పోలీస్ మత్స్య శాఖ అధికారులతో చర్చించి ఉమ్మడిగా దాడులు చేయించారు. దాంతో అలివి వలలను తొలగించారు. కొంత కాలం పాటు అడ్డుకట్ట పడినా ఆ తర్వాత అక్రమర్కులు మళ్లీ అలివి వలలతో వేట ప్రారంభించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సోమశిల డ్యామ్ లోపల అలవి వలల వేటను పూర్తిగా అరికట్టి తమను ఆదుకోవాలని స్థానిక మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.