English | Telugu

ఈసీ తీవ్ర కసరత్తు.. దేశంలో ఎక్కడ నుంచైనా ఓటేయొచ్చు

దేశంలోని ఓటింగ్ విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది ఎన్నికల కమిషన్. దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేసేందుకు ఓటర్ కు వెసులుబాటు కల్పించేలా ఈసీ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన బ్లాక్ చెయిన్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మద్రాస్ ఐఐటీతో కలసి ఈసీ పని చేస్తున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు.

ఈ విధానం అమల్లోకి వస్తే దేశంలో ఓటర్లు ఎక్కడి నుంచైనా ఓటు వేసేందుకు వీలుంటుందని తెలిపారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటర్లు మాత్రమే కొత్త విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇందుకు చట్టంలోనూ మార్పులు అవసరమని అన్నారు సునీల్ అరోరా.

లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలే నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు. పార్టీలు నిర్ణయిస్తే అమలుచెయ్యటానికి ఈసీ ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. అలాగే.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయలేరని ఆయన మరోసారి స్పష్టం చేశారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే ఉండదని సునీల్ అరోరా అన్నారు.