English | Telugu

కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ మారుతున్నారని ప్రచారం! హై టెన్షన్ మధ్య దుబ్బాక పోలింగ్ 

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడం తీవ్ర దుమారం రేపింది. పోలింగ్ ప్రారంభ సమయానికి ఈ ప్రచారం జరగడంతో కాంగ్రెస్ నేతలు, కేడర్ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నేతలు. ఓటమి భయంతోనే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, మంత్రి హరీష్ రావులు తనపై కుట్రలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన తోగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ చేస్తున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం బీజేపీ,టీఆర్ఎస్ లు చిల్లర రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి దుబ్బాక రాజకీయాలు హాట్ హాట్ గానే సాగాయి. రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోయాయి. ఓటర్లకు జోరుగా ప్రలోభాలకు గురి చేశాయి పార్టీలు. ప్రచారంలోనూ పార్టీల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పోలింగ్ కు కొన్ని గంటల ముందు కూడా తీవ్ర గొడవలు జరిగాయి. సిద్ధిపేటలోని ఓ హోటల్ లో బస చేసిన ఆందోలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తత స్పష్టించింది. హోటల్ కేంద్రంగా ఎమ్మెల్యే డబ్బులు పంపిణి చేస్తుండగా తాము అడ్డుకున్నామని, తమపైనే ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించగా.. తనను టార్గెట్ చేసుకునే వంద మంది బీజేపీ కార్యకర్తలు హోటల్ కు వచ్చారని ఎమ్మెల్సే క్రాంతి కిరణ్ చెప్పారు. ఈ ఘటనతో సిద్ధిపేటతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ హోరాహోరీగా సాగుతోంది. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ధగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఓటర్లు కూడా ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు తన సొంతూరు బొప్పాపురం ఓటు వేయగా.. తొగుట మండలం తుక్కపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.