English | Telugu
కియా... ఏపీ నుంచి ఎందుకు వెళ్లాలనుకుంటోంది? తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ డిటైల్స్...
Updated : Feb 11, 2020
ఆంధ్రప్రదేశ్ లో కియా ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కియా ఎక్కడికీ తరలిపోవడం లేదంటూ ఏపీ మంత్రులు, ఎంపీలు, వైసీపీ ముఖ్యనేతలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నా... రాయిటర్స్ మరోసారి తమ కథనానికి కట్టుబడి ఉన్నామంటూ తేల్చిచెప్పడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది. నిజంగానే కియా ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతే అది జగన్ ప్రభుత్వానికి కోలుకోలేని ఎదురుదెబ్బే అవుతుంది. ఎందుకంటే, ఏ అంతర్జాతీయ కంపెనీ కూడా ఏపీకి రావడానికి ఇష్టపడదు. ఇంటర్నేషనల్ సంస్థలే కాదు... కనీసం దేశీయ పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రా వైపు చూడటానికే భయపడతారు. అయితే, నిప్పులేనిదే పొగ రాదన్నట్లుగా జగన్ ప్రభుత్వానికి... కియా యాజమాన్యానికి మధ్య ఘర్షణ వాతావరణమైతే కచ్చితంగా కనిపిస్తోంది. పలు విషయాల్లో కియాపై జగన్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం అందుతోంది. అయితే తమ ఒత్తిడికి కియా దిగొస్తుందని జగన్ ప్రభుత్వం భావించగా... అందుకు పూర్తి రివర్స్ లో మొత్తం ప్లాంట్ నే తరలించేందుకు తమిళనాడుతో సంప్రదింపులు జరిపి కియా షాకిచ్చినట్లు తెలుస్తోంది. కియా ఇచ్చిన షాక్ తో కంగుతిన్న జగన్ ప్రభుత్వం... హుటిహుటిన నష్టనివారణ చర్యలు చేపట్టింది. కియా ఎక్కడికీ తరలిపోవడం లేదని, టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ చంద్రబాబుపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి కియా వెళ్లిపోవాలని అనుకోవడానికి ప్రభుత్వ ఒత్తిడితోపాటు వైసీపీ నేతల గొంతెమ్మ కోర్కెలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల్లో 75శాతం స్థానికులే ఉద్యోగాలు ఇవ్వాలంటూ చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కారు... ఇప్పుడు ఉద్యోగుల్లో ఐదువేల మందిని తీసేసి... స్థానికులను పెట్టుకోవాలని కియాపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఐదు వేలమందిలో ఆంధ్రావాళ్లున్నా... వాళ్లను కూడా తీసేసి తమ అనుచరులకు ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు కియాపై ప్రెజర్ పెడుతున్నారట. అలాగే, ఇఫ్పుడున్న 160కోట్ల విలువైన స్క్రాప్ కాంట్రాక్టర్లను తొలగించి తన తమ్ముడికి ఇవ్వాలని ఒక ఎంపీ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 120కోట్ల ఆలిండియా కార్గో కాంట్రాక్టరును తొలగించి తమకివ్వాలని ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ప్రెజర్ పెడుతున్నట్లు సమాచారం. అలాగే, కియాలో 5కోట్ల విలువైన పారిశుద్ధ్య పనుల కాంట్రాక్టను తమ అనుచరుడికి ఇవ్వాలని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక, త్వరలో కట్టబోయే కొత్త ఫ్యాక్టరీని తమ పొలాల దగ్గరే కట్టాలని ఒక వైసీపీ ఎమ్మెల్యే కియా మేనేజ్ మెంట్ పై ప్రెజర్ పెడుతున్నట్లు టాక్... వీటన్నింటినీ మించి... మార్కెట్ ధర కంటే మూడు నాలుగు లక్షల తక్కువ ధరకు మూడు వందల కార్లు ఇవ్వాలని, వాటిని మేము అమ్ముకుంటామని ఒక వైసీపీ ఎమ్మెల్యే... అలాగే, జగన్ సన్నిహితుడు... ఒక ఉన్నతాధికారి కలిసి కియాపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, ఆయా మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారుల నుంచి వస్తున్నట్లు ఒత్తిళ్లను కియా యాజమాన్యం.... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అలాగే, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లినా... పట్టించుకోలేదని, అందుకే ప్లాంట్ ను తరలించాలనే ఆలోచనకు వచ్చిందని అంటున్నారు. ఇక్కడ ఉండే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి వస్తుందని, కానీ... ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కంపెనీగా, విలువలు పాటించే సంస్థగా అది తమకిష్టం లేదని కియా యాజమాన్యం అంటోందట. డిమాండ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, అవసరమైతే ఏపీ నుంచి ప్లాంట్ ను తరలించేద్దామనే నిర్ణయానికి కియా యాజమాన్యం వచ్చేసిందని అంటున్నారు.