English | Telugu

ప్లాస్టిక్ ఫ్రీ పెళ్లి... ఆదర్శంగా నిలిచిన మహబూబాబాద్ దంపతులు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి అందరికీ ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నారు ఈ పెళ్లి వేడుక వారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జంగాల నరేష్, దివ్య రేఖల కల్యాణం స్థానిక బాలాజీ గార్డెన్స్ లో బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన వారు అందరికీ అర్థమయ్యేలా ప్లెక్సీలు లేకుండా తెల్లటి బట్టపై ఫోటోలను అతికించారు. వచ్చిన వారందరికీ స్టీలు గ్లాసులలో మంచినీటిని అందించారు. ప్లేట్లకు బదులుగా అరటి ఆకులు వేసి ఆహారాన్ని అందించారు. ఇది చూసిన వారందరూ పూర్వీకులు గుర్తుకొచ్చారని చెప్పుకుంటున్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకోవాలని వివాహాన్ని ప్లాస్టిక్ రహిత వివాహంగా ఆహ్వానించామని అన్నారు. వివాహానికి వచ్చిన వారంతా ఇన్ స్పైరై ఎలాంటి విందులు వినోదాలలో ప్లాస్టిక్ వాడకాన్ని వినియోగించకూడదనే సంకల్పంతో ఈ ఏర్పాటు చేశామని దీనికి అందరూ సహకరించాలని కోరారు. తన పెళ్లి వల్ల కొందరిలో అయిన ఆలోచన మొదలైందని పెళ్ళికుమారుడు బంధువు నవీన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలా చేయటంలో ఎంతో సంతృప్తి నిచ్చిందని వచ్చిన వారంతా మాలాగా ప్లాస్టిక్ రహిత వేడుకలు నిర్వహిస్తే కనీసం కొంతమేరైనా ప్లాస్టిక్ నివారించినవారమవుతామని ఆయన తెలిపారు. ఏది ఏమైనా ఈ వివాహ వేడుకను చూసైనా ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేసి పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని ఈ వేడుకకు వచ్చిన వారు అనుకుంటున్నారు.