English | Telugu
మొన్నటివరకు ఉల్లి... ఇప్పుడు ఎండు మిర్చి...
Updated : Jan 5, 2020
మొన్నటివరకు ఉల్లి... ఇప్పుడు ఎండు మిర్చి... సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎండు మిర్చిని తింటేనే కాదు... ధర వింటేనే చాలు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒకటికి మూడు రెట్లు పెరిగిన ఎండు మిర్చి ధరలు మంట పుట్టిస్తున్నాయి. అసలు తినకుండానే మిర్చి ఘాటు నషాళానికి ఎక్కుతోంది. కొద్దిరోజులుగా కొంచెం కొంచెం పెరుగుతూ వస్తోన్న ఎండుమిర్చి ధరలు అమాంతం పెరిగిపోయాయి. మొన్నటివరకు కిలో 90 రూపాయలున్న ఎండుమిర్చి... ఇప్పుడు ఏకంగా 240 రూపాయలు పలుకుతోంది. దాంతో, మిర్చిని తింటేనే కాదు... దాని రేటు వింటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.
కూరల్లోనూ, తాళింపుల్లోనూ కచ్చితంగా వాడే ఎండుమిర్చి ధరలు ఇలా, ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యులు హడలిపోతున్నారు. ఇప్పటికే ఉల్లిని కొనలేని పరిస్థితి ఉంటే, ఇఫ్పుడు దాని జతకు ఎండుమిర్చి కూడా చేరిందని వాపోతున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఇలా పెరిగిపోతుంటే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు పంట దిగుబడి పడిపోవడంతోనే ఎండుమిర్చి ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎండుమిర్చి ధర ఇంకా పెరిగే అవకాశమే ఉందంటున్నారు. మొత్తానికి, మొన్నటివరకు ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తే, ఇప్పుడు ఒకటికి మూడు రెట్లు పెరిగిన ఎండుమిర్చి... తినకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది.