English | Telugu

కార్పోరేట్ సేవ‌లో క‌రోనా ప్యాకేజ్! ట్రంప్ నిర్ల‌క్ష్యానికి పారాకాష్ట‌!

గాంధీ ఆసుప్ర‌తిలో రోగి బంధువులు డాక్ట‌ర్ ను కొడితే, అమెరికాలో వైద్య సిబ్బందిని దొంగ‌లంటూ అధ్య‌క్షుడు ట్రంప్‌యే ఆడిపోసుకుంటున్నాడట‌. మాస్కులను ఆసుపత్రులు, వైద్య సిబ్బంది దొంగిలించడం వల్లే వీటికి కొరత ఏర్పడిందని ట్రంప్‌ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. యుద్ధ రంగంలో ముందుండి పోరాడుతున్న సైనికులను కమాండర్‌ నిందించి కూర్చొన్నట్లుగా ఉంది ట్రంప్‌ తీరు. కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్‌ వర్కర్లకు అవసరమైన మాస్కులు, గ్లౌజులు, గౌనులు, టెస్టింగ్‌ కిట్లు, రెస్పిరేటర్లు, శానిటైజర్లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచేందుకు నిర్దిష్ట చర్యలేవీ తీసుకోవ‌డం లేదు. పైగా వారిని దొంగలుగా చిత్రించే ప్రయత్నం చేశాడు.

కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో చైనా అనుభవం నేర్పిస్తోంది. అలాగే ఎలా ఎదుర్కోకూడదో అమెరికా అనుభవం గుణ‌పాఠం నేర్పుతోంది. ట్రంప్ నిర్లక్ష్యానికి అమెరికాలో 2,13,003 కేసులు నమోదు కాగా 5 వేలకు పైగా మృత్యు వాత పడ్డారు. అమెరికాలో క‌రోనా కాటుకు జ‌నం బ‌లి అవుతుంటే ట్రంప్ ఏమో కార్పోరేట్ కంపెనీల సేవ‌లో త‌రిస్తున్నాడ‌ట‌. క‌రోనా ప్యాకేజ్ కూడా వారికే అర్పిస్తున్నాడ‌ట‌.

కరోనా ప్రమాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ), ఆరోగ్య రంగ నిపుణులు చేసిన హెచ్చరికల్ని ట్రంప్ ప‌ట్టించుకోలేదు. కరోనా మహమ్మారి అంతమయ్యేలోపు అమెరికాలో 2 లక్షల మందిని అది బలిగొంటుందని ప్రముఖ వైద్య నిపుణులు, అమెరికాలోని అలర్జీ, అంటువ్యాధుల జాతీయ పరిశోధనా సంస్థ డైరక్టర్‌ అంథొనీ ఫౌసి చేసిన హెచ్చరికను ట్రంప్ నిర్ల‌క్ష్యం చేశారు.

నిరుద్యోగం కనివిని ఎరుగని రీతిలో 32.7 శాతానికి చేరుకోనున్నదని ఆర్థిక వేత్తల అంచనా. చరిత్రలో ఇదొక అసాధారణ పరిస్థితి. ట్రంప్‌ ప్రభుత్వం మొదట ఇదంతా మీడియా సృష్టి అని, గోరంతలు కొండంతలు చేసి చూపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందంటూ సమస్య తీవ్రతను గుర్తించేందుకు నిరాకరించారు. ఫలితంగా కరోనా అమెరికాలోని యాభై రాష్ట్రాలకు విస్తరించింది. అమెరికా వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉన్న న్యూయార్క్‌ సిటీ కరోనాకు కేంద్ర స్థానంగా మారింది.

కరోనాపై పోరు పేరుతో 2.2 లక్షల కోట్ల డాలర్లతో తీసుకొచ్చిన ప్యాకేజీలో సింహభాగం ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌, స్పేస్‌, హోటల్‌ పరిశ్రమకే దక్కనుంది. కార్పొరేట్లు, కుబేరుల డబ్బుతో అధికారంలోకి వచ్చిన రిపబ్లికన్‌ పార్టీ కి, ఈ సంక్షోభాన్ని తన కార్పొరేట్‌ మిత్రులకు వరంగా మార్చడమెలా అన్నదే ధ్యేయమైపోయింది.