English | Telugu

దివ్య కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

ఇటీవల విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కలిశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ నేత దేవినేని అవినాష్‌ లు దివ్య తల్లిదండ్రులు కుసుమ, జోసెఫ్ లతో పాటు ఆమె సోదరుడు దినేష్‌ లను సీఎం జగన్‌ వద్దకు తీసుకొచ్చారు. దివ్య కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. సీఎంను కలిసిన దివ్య తల్లిదండ్రులు తాము బిడ్డను పోగొట్టుకున్నామని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అలాగే, దివ్య కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల సాయం ప్రకటించారు.

అనంతరం దివ్య తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళామని చెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారని తెలిపారు. హోం మంత్రి సుచరిత కూడా తమ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.