English | Telugu
నిర్భయ దోషుల డెత్ వారెంట్ పిటిషన్లపై ఈరోజు కోర్టులో విచారణ...
Updated : Feb 13, 2020
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు విషయంలో జరుగుతున్న జాప్యం పై నిర్భయ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దోషులని వెంటనే ఉరి తీయాలని కోరుతూ మరోసారి న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డెత్ వారెంట్ పిటిషన్లపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. తమ కూతురికి న్యాయం చేయాలని, దోషులను తక్షణమే ఉరి తీయాలని కోరుతూ కోర్టు మెట్లెక్కారు నిర్భయ తల్లితండ్రులు. ఏడేళ్లయినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థపై తమకు నమ్మకం పోతోందని, శిక్ష అమలుపై జాప్యం జరుగుతుండటంతో కోర్టు ఆవరణలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఉరి నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. నిజానికి ఆ నలుగురినీ జనవరి 22 నే ఉరి తీయాలని తొలుత డెత్ వారెంట్ లు జారీ కాగా, వారికి చట్ట పరంగా అన్ని హక్కులూ కల్పించాలంటూ దోషుల తరఫు లాయర్ వాదించడంతో ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు ఢిల్లీ పాటియాలా కోర్టు మరోసారి వారెంట్ లు జారీ చేసింది. వారం రోజుల్లోగా అన్ని అవకాశాలు వినియోగించాలంటూ కోర్టు డెడ్ లైన్ విధించింది. టైం దగ్గర పడిన సమయంలో లాయర్ లేడంటూ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా కోర్టుకు విన్నవించారు. దీంతో మరోసారి శిక్ష అమలులో జాప్యం నెలకొంది, పవన్ గుప్తా అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం తక్షణ సాయం అందించింది. ఎంప్యానెల్ న్యాయవాదుల జాబితానిచ్చి లాయర్ ను ఎంచుకోవాలని సూచించింది. ఇక డెత్ వారెంట్ పిటిషన్లపై ఇవాళ కోర్టు విచారణ చేపట్టనుంది.